Sunday, December 18, 2011

అవిద్య


ఎట్టిది మదిలో చీకటి!
వట్టిగ వాదులకుఁ ద్రోయుఁ వాసనలూరన్
మట్టినఁ బోసిన పాలుర
గట్టిగ శౌరినిఁ దలవని ఘడియలు శాస్త్రీ!

భా:- మనసులో ఉన్న అవిద్య (అజ్ఞానం) ఎంత బలమైనది! ఊరికెనే వాసనలను పెంచే వాదాలకు ఉసిగొలుపుతుంది. కానీ, మనసులో దృఢంగా శ్రీహరిని తలువని క్షణం మట్టిలో పోసిన పాలవలే వృథా.

Saturday, November 5, 2011

ఉత్తుత్త భక్తి


చెప్పులఁ పైదృష్టి నిలిపి
చప్పున గుడిలోకిఁ బోయి చకచక వచ్చే
కప్పిన వెఱ్ఱిని భక్తిగ
చెప్పుకు తిరిగే మొరకులఁ జేరకు శాస్త్రీ!


భా:- తమకున్న వెఱ్ఱిని భక్తి అని తమను తాము మభ్యపెట్టుకుంటూ ఉండేవాళ్ళలో కలవద్దు. గుడిలో ఉండి చెప్పులు పోతాయేమోనని భయపడుతూ చకచకా దణ్ణం పెట్టుకుని పోకూడదు. (గుడిలో ఉన్నప్పుడు వ్యామోహాలను విడిచి, దైవాన్ని గురించి చింతించాలి అని భావం.)

Saturday, August 20, 2011

నా దారి వేరు

పలువురు నడిచిన బాటనఁ
మెలగుట తలవంపనుకొని మిడిమేలముతో
తొలగిన వాడైన కడకు
కలువక తప్పదు ధరణినిఁ గదరా శాస్త్రీ

భా:- అందరూ వెళ్ళే దారిలో వెళ్ళడమే నామోషీ అని భావించిన వారు కూడ చివరకు మట్టిలోనే కలుస్తారు కదా?

Sunday, June 26, 2011

సుఖాలకు అలవాటు పడితే...

గాత్రసుఖముఁగోరు నరుడి
ఆత్రము కనరాదుఁజూడనాశయమందున్
సత్రము మరగిన తెరువరి
యాత్రకు అవధేమి లేని యట్టుల శాస్త్రీ!

భా:- శరీరానికి సుఖం కలుగాలని ఆశించేవానియందు ఆశయానికై తొందర కనబడదు. సత్రంలో లభించే భోజనానికి అలవాటు పడిన వాడికి గమ్యం చేరాలనే తొందర ఏముంటుంది?

Saturday, May 21, 2011

మూఢునితో చెప్పిన రహస్యం

గాఢంబగు చెలిమి వలనఁ
ప్రౌఢిమ కఱువై మసలెడి ప్రాణహితునకున్
గూఢంబులఁదెలుపకుమీ
మూఢుని నాల్క విషతమము ముప్పుర శాస్త్రీ!

Tuesday, July 6, 2010

చేసిచూపాలి

చిత్తములో, వేలకొలది
ఉత్తమయోచనలు కూడ రూపింపనిచో
ఉత్తవెయగు, రాతినిఁబడు
విత్తునమునఁ బ్రాణమెట్లు  వెల్వడు శాస్త్రీ!

కొన్ని పదాలకు అర్థాలు:
--
రూపించు = నిరూపించు, చేసి చూపు
వెల్వడు = వెలువడు, బయటకు వచ్చు

భావము: మనసులో వేలకువేలుగా ఆలోచనలు ఉన్నా, వాటిని మనం ఆచరణలో పెట్టి ఋజువుచెయ్యకపోతే, అవి పనికిరావు.  రాతిపైన పడిన విత్తనం మొలకెత్తుతుందా? (రాతిని ఊహలతోనూ, ఆలోచనలను విత్తనముతోనూ, మట్టిని వాస్తవంతోనూ పోల్చడం జరిగింది).

Sunday, June 27, 2010

పరమాత్మ ఒక్కటే

పరమగు శక్తినిఁ గాంచక
హరిహరులకు భేదమెంచి యధికుడెవడనన్
యిరువురునొకటేనన్నది
యెరుగని నీలోని మాయె హెచ్చుర శాస్త్రీ

భావం: పరమాత్ముణ్ణి దర్శించలేక శివుడు గొప్పా? విష్ణువు గొప్పా? అని ప్రశ్నిస్తున్నావు అంటే ఆ రెండు రూపాలలో ఉన్న పరమైనశక్తి ఒకటేనన్న విషయాన్ని గ్రహించలేని నీలోని మాయ బలమైనది అని సంకేతం.

వివరణ: శివుడు గొప్పా? కేశవుడు గొప్పా అన్న విషయానికి అనేకమంది అనేక సమాధానాలు ఇచ్చారు. పురాణాలను రచించిన వ్యాసభగవానుడు కూడా ఒక్కో పురాణంలో ఒక్కోలాగా చెప్పాడు. కొందరి చర్చించుకున్నారు, కొందరు వాదించుకున్నారు, కొందరు ద్వేషించుకున్నారు, కొందరి కొట్టుకున్నారు. కానీ ఒక్క విషయం గమనించాలి. ప్రపంచాన్నంతటినీ సృష్టించినది ఒక శక్తే ఐతే ఆ శక్తికి ఒక భాషేమిటి? ఒక రూపమేమిటి? ఒక లింగభేదమేమిటి? ఒక గుణమేమిటి? పరమాత్మ ఒక్కటే! మన చూసే దృష్టిని బట్టి ఒక్కో ఆకారంలో కనిపిస్తాడు.  మన ఉపనిషత్తులలో కూడా "తత్ త్వం అసి" అని అన్నారు కదా?

మన వైదీక సంస్కృతిలో ఒక గొప్పదనం ఉంది. ఒకరే దేవుడు అని మనం అనము. అమ్మ, నాన్న, గురువు, పెద్దలు, పిల్లలు  అందరినీ దేవుళ్ళంటాము. గోవు, పాము, ఎద్దు, ఏనుగు ఇలా జీవరాశినంతా పరమాత్మ ప్రతిరూపాలుగా పూజిస్తాము. కాకి, కుక్క, కోతి అని భేదం చూపించకుండా వాటిని పోషిస్తాము. చెట్టుని, అడవిని, కొండని, రాయిని, పుట్టనీ కూడా పూజిస్తాము. అన్నింటిలోనూ ఆ పరమాత్మను చూడాలి అన్న మన సంస్కృతి పరమార్థాన్ని గ్రహించకుండా ఎవరు గొప్ప అని కొట్టుకోవడం అవివేకం కదా?


మళ్ళీ చాలా కాలానికి ఈ శతకంలో పద్యాలు వ్రాస్తున్నాను. కొన్నాళ్ళు విరామం తీసుకుందాము అనుకున్నవాడిని క్రమేపి బద్ధకించాను. నన్ను వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహించిన చదువర్లకు నా నమస్కారాలు. మీకు నేను ఋణపడి ఉన్నాను. ఇకపై తప్పకుండా తరచూ పద్యాలను వ్రాస్తాను.