Wednesday, December 5, 2018

కార్తిక మాసం సందర్భంగా - 13

మాటలు, చేతలు, డెందము
గాటపు త్రిపురాలు దురితకారకముల్ నీ
మేటి కరకు జ్ఞానేషువు
వేటునఁ నాయహముఁ జంపు వేదాంతనిధే!

భా:- "మనసు, వాక్కు, కర్మ" అనే మూడూ త్రిపురాలుగా అయ్యి నా చేత పాపములు చేయిస్తున్నాయి. నీ సుజ్ఞానం అనే బాణంతో నా అహాన్ని చంపు, (త్రిపురాలను నాశనం చేసిన) శివా! 

Tuesday, November 27, 2018

కార్తిక మాసం సందర్భంగా - 12

చాపపు నేరిమి దేవర
పాపపు పులి నోట చిక్కి బడలితి, కరుణా
రోపము గురి చూసి విడుమ
మాపు జననమరణవనిని మారాంతకుడా!

భా:- ధనుర్విద్యకు దేవతా! కామాన్ని జయించినవాడా! పాపం అనే పులి నోట చిక్కి అలిసిపోయాను. నువ్వు దయ అనే బాణాన్ని గురి చూసి పంపి పులితోబాటు ఈ జననమరణాలు అని అడవినే నాశనం చెయ్యి. (కామం వలనే పాపం పుడుతుంది. ఆ కామాన్ని జయించినవాడు పాపాన్ని నాశనం చెయ్యగలడు).

Saturday, November 24, 2018

కార్తిక మాసం సందర్భంగా - 11

ఒడిలో బిడ్డడి యెలుకను
మెడలో బుసగొట్టు పాము మింగగఁజూడున్
ఎడమన పసివాని నెమలి
మిడినాగునుఁత్రుంచనెగురు మీదకునెపుడున్

వింతగు కాపురమును నీ
ఇంతి నడుపుచున్ జగములనేలుచునుండన్
సుంతయు బాసటనీయక
చింతెరుగని భిక్షువగుట చెల్లెను నీకే!

భా:- గణపతి వాహనమైన ఎలుకని మింగడానికి నీ మెడలో పాము బుసగొడుతూ ఉంటే, ఆ పామును మింగడానికి నీ చిన్నకొడుకు వాహనం నెమలి ఎగురుతూ ఉంటుంది. నీ ఇల్లాలు ఈ వింతైన కాపురాన్ని నడుపుతూనే జగాలను కూడా ఏలుతోంది. నువ్వు మాత్రం కొంతైనా సాయం చెయ్యకుండా భిక్షం ఎత్తుకుంటూ ఉన్నావు. ఈ వైభవం నీకే కుదిరింది.

Friday, November 23, 2018

కార్తిక మాసం సందర్భంగా - 10

ఎదలో కోర్కెలు ఎద్దుర
మదమొక గజముర చిలువర మత్సరమెల్లన్
పదునగు కోపము వ్యాఘ్రము
అదుపున పెట్టెడి కుశలతనందించు శివా!

భా:- ఎద్దులాగ ఎగిరిపడే కోర్కెలు, ఏనుగంత అహంభావం, పాములాగ బుస కొట్టే ఈర్ష్యా, పులి వంటి కోపం నాలో ఉన్నాయి.ఈ జంతువులని అదుపులో పెట్టిన నీవు నాకు కూడా ఆ దక్షతని అందించు, పశుపతీ! [నువ్వు ఎద్దుని (నందివాహనుడు), ఏనుగుని (గజచర్మాంబరుడు), పాములని (నాగాభరణుడు), పులిని (వ్యాఘ్రాజినాంబరుడు) అదుపులో పెట్టినవాడవు కదా.]

గ:- ఈ భావం నాది కాదు. ఈ టీ.వీ. శివలీలలు కార్యక్రమంలో విన్నది.

Wednesday, November 21, 2018

కార్తిక మాసం సందర్భంగా - 9

చలియించని యోగి, ఉమను
వలపించిన రాగి, కొలుచు వారికి ఱేడున్
కలచిన కీడున్ నటనకు
నెలవగు స్థాణువు శివుడిని నిత్యము తలతున్

భా:- స్థిరంగా ఉండే యోగి, అమ్మవారి మనసును ఆకర్షించిన అనురాగవంతుడు, కొలచిన వారిని ఆదుకొనేవాదు, చీకాకు పెట్టే వారికి శిక్షకుడు, కదులుతూ నాట్యం చేసే నటరాజు, అస్సలు కదలని స్థాణువు - అన్నీ అయిన శివుడిని ఎప్పుడూ తలుస్తూ ఉండెదను.

Monday, November 19, 2018

కార్తిక మాసం సందర్భంగా - 8

కైలాసంబున శైత్యము
మేలగు వినుదుస్తు నీది, మిన్నది తలలో
శైలజ కౌగిలి వీడవ
దేలన చలికోపలేక, ఇషణము మిషయే!

భా:- కైలాసంలో చలి, చక్కని ఆకాశాన్ని బట్టులుగా ధరిస్తావు, తలలో గంగమ్మ. పార్వతి కౌగిలి (పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం) వీడవంటే - చలికి తట్టుకోలేక. భార్య మీద ప్రేమ (ఇషణం) వత్తి సాకు (మిష).

Sunday, November 18, 2018

కార్తిక మాసం సందర్భంగా - 7

పెక్కులఁ నిన్నును కలచెడి
రక్కసులకు వరములీయ రవ్వంతైనా
లెక్కించక, పెళ్లి జరుప
నక్కరఁ జూపిన వలదొర నణచుట పాడా!

వలదొర - వలపు దొర - మన్మథుడు

Saturday, November 17, 2018

కార్తిక మాసం సందర్భంగా - 6

ఆపవు కద భిక్షించుట
శ్రీపతి శ్రీదుల నడగక సెరబడియున్నన్
దాపున గంగను కలిగియు
ఆ పై యడిగేవు జనులనభిషేకముకై!

భా:- శివ! లక్ష్మీదేవి భర్త ఐన విష్ణువు, ధనవంతుడైన కుబేరుడూ నీకు మిత్రులైనా వాళ్ళని సాయం అడగక భిక్షమెత్తుకుంటావు. కానీ, నెత్తిపైన గంగను ఉంచుకుని జనాలను అభిషేకం చెయ్యమని అడుగుతావు. (ఇదేం విడ్డూరం!)

సెరబడి - చెలిమి; శ్రీదుడు - కుబేరుడు

Friday, November 16, 2018

కార్తిక మాసం సందర్భంగా - 5

సిగలోనల్లరి విన్నది
రగిలే కన్నుయు నుదుటన, రాగలు మెడలో
నగుమోమునఁ మోసెడి దొర!
బెగడక మను పట్టు మదిన పెంచుము తండ్రీ!

భా: జటాజూటంలో ఎగసిపడే గంగమ్మ, నుదుటిపైన నిప్పులు రగిలే కన్ను, మెడలో పాములు (అన్నీ ప్రమాదాలే అయినా) నవ్వుతూ వాటిని మోసేవాడా - భయపడకుండా ఉండే స్థైర్యాన్ని మా మనసుల్లో పెంచు తండ్రీ!

గమనిక:

పద్యమంతా తెలుగు పదాలతో రాయాలి అనిపించింది. అందుకే బ్రౌన్య నిఘంటులో వెతికి "విన్నది" (విను + నది), "బెగడు" (భయపడు), "రాగలు" (పాములు) పట్టుకున్నాను. పద్యంలో భాగస్వామ్యం బ్రౌన్ దొరకు కూడా ఉంది.

నిఘంటువులో "రాగ" అనే పదానికి అర్థం చెప్తూ "లాగదాగుడురాగ ప్రోగులిడెడుప్రోడ" అన్న వృత్త్యనుప్రాస ప్రయోగాన్ని ప్రస్తావించారు (లాగ - కన్నం, దాగుడు - దాక్కొనడం, రాగ - పాము, ప్రోగులు - చెవి పోగులు, ఇడెడు - ధరించే, ప్రోడ - సమర్థుడు; అంటే శివుడు). మన భాషలోని తియ్యదనం అంతా కలిపి శివుణ్ణి పొగిడినట్టు అనిపించింది. అద్భుతం!

Wednesday, November 14, 2018

కార్తిక మాసం సందర్భంగా - 4

మాటకునూపిరి పోయగ
గాటపు శివసూత్రములను కల్పించితివే
నోటపలుకకుండ నిజము
తేటగ తెలిపెడి వలకడ దేవర ప్రణతుల్!

దక్షిణామూర్తి (వలకడ - దక్షిణదిక్కు) రూపంలో నోట మాట పలుకకుండా సత్యాన్ని (సత్) తెలుపగలిగిన యోగి, మనుషుల కోసం 14 శివ (మాహేశ్వర) సూత్రాలను పాణినికి ప్రసాదించి భాషను సృష్టించాడు. వానికి నమస్సులు.

కార్తిక మాసం సందర్భంగా - 3

కరిముఖమార్కండేయులఁ
మరణము దాటించినావు; మృత్యుంజయుడా!
గరళము మింగితివి నగుచు
కరుణను మముఁ గావుమయ్య కాలాంతకుడా!

శివ! నువ్వు నవ్వుతూ విషాన్ని తాగావు. మార్కండేయుణ్ణి యముడి (మృత్యువు) నుండి కాపాడావు. వినాయకుడికి ఏనుగు తలతో మరో జన్మను ప్రసాదించావు. యముడిని కూడా అంతం చేయగలవాడా - కరుణతో మమ్మల్ని కాపాడు.

Tuesday, November 13, 2018

కార్తిక మాసం సందర్భంగా - 2

ఒడలునఁ జతపడియుండిరి
విడరెట రాయిగ వెలసిన వేడుక మీరన్
గడుసరి భక్తుడడుగ సతి
నెడబాసిన వేల్పు కన్న హెచ్చును గలరే?

శివపార్వతులు లింగరూపమునైనా అర్థనారీశ్వరులుగానైనా ఒకటై అందంగా ఉన్నారు. అట్టిది, గజాసురుడు అడిగితే తన భార్యను విడిచి వెళ్ళిన శివుడి కంటె దైవం ఉందా?

Sunday, November 11, 2018

కార్తిక మాసం సందర్భంగా - 1

తనరునె ధరణీతలమున
తనయుని గని నవ్వినట్టి తమ్మిపగతునిన్
తన తలపై మోసెడి గిరి
తనయా ధవుఁ మించినట్టి దయగలవాడున్?

తనరు - కనబడు, ఉండు; తమ్మిపగతుడు - తామరకు శత్రువు (చంద్రుడు); గిరితనయాధవుడు - శివుడు

Wednesday, March 28, 2018

శ్రీరామనవమి సందర్భంగా

కౌశికయాగరక్షకుని గౌతమ శాపవిదూరకారకున్
కేశనిబద్ధశీతకర కేతనచాపవిభంగకర్తనున్
దాశరథిన్ రమాసహితుఁ దానవ శిక్షకుఁ లోకపాలకున్
ఈశవిరించివందితుని హేలికులార్ణవచంద్రుఁ మ్రొక్కెదన్

గౌతమ శాప విదూర కారకుడు - గౌతముని యొక్క శాపం దూరం చేసినవాడు
కేశ నిబద్ధ శీతకర కేతన చాప విభంగ కర్త - జుట్టుతో కట్టబడిన చంద్రుడే తన గుర్తుగా కలిగిన వాని ధనుస్సును విరిచినవాడు
హేలి కుల అర్ణవ చంద్రుడు - సూర్యుని వంశం అనే కడలికి చంద్రుడు వంటివాడు

Sunday, January 28, 2018

ప్రజ్ఞాదీపం

నీ పాదంబులఁ మదిలో
రూపించితి భక్తిమీర రుచిరచరణ నా
పాపంబుఁ ద్రుంచి ప్రజ్ఞా
దీపంబును వెలుగజేయి తిరముగ రమణా!

Monday, October 10, 2016

వినయము, మౌనము, శాంతము,
పనిపై గురి, పరులు మేలుఁ బడయగ మనసున్
వెనుదిరుగని పట్టుదలయు,
నిను వీడకనుండఁ గోరు నిత్యము శాస్త్రీ

Saturday, August 27, 2016

నెత్తురు పలుచై, తలపై
కెత్తగనోపిక చాలక, యింద్రియములలో
సత్తువ కొదవైనపుడును
మెత్తగ పలుకరు మొరకులు మిడియుచు శాస్త్రీ

భా:- చిక్కిపోయినా, తలను పైకి ఎత్తే ఓపిక లేకపోయినా, ఇంద్రియాలపై అదుపు తప్పిపోయినా సరే సున్నితంగా మాట్లాడటం పొగరుబట్టిన మూర్ఖులకు చేతకాదు.

Sunday, September 13, 2015

అహం ఒక మహావృక్షం

అహమను మ్రానుకు తలపులు
గహనపు కొమ్మలు, వలపులు గాఢపు వేళ్ళున్
ఇహమాధారము, విషయపు
లహరియె వాయువు, వరుణము లౌల్యము శాస్త్రీ

భా:- అహమనే చెట్టుకి - ఆలోచనలు దట్టమైన కొమ్మలు, కోరికలు లోతైన వేరులు, ప్రపంచం ఆధారం, విషయాలు గాలి, (విషయాల పట్ల) ఆసక్తి నీరు. చెట్టు నేల, గాలి, నీరు ఆధారంగా వేళ్ళు, కొమ్మలు పెంచుకుంటుంది. అహం ప్రపంచం, విషయాలు, ఆసక్తి ఆధారంగా కోరికలను, ఆలోచనలను పెంచుకుంటూ ఉంటుంది.

Monday, August 18, 2014

ధనం - నిద్ర

ఉదరము నిండిన ధనికుడు
పదవికి పోరుచు పరుపున పడుకొనకుండన్
కదలగనోపిక కరువై
నిదురించును పేదవాడు నేలనె శాస్త్రీ

భా:- ఈ రోజు ధన, పదవీ కాంక్షలు విడ్డూరంగా ఉన్నాయి. లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు, పదవుల నిచ్చెన ఎక్కడానికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని త్యాగం చేస్తున్నారు. వాళ్ళకు పరుపున్నా నిద్ర పట్టదు. కడుపు నిండా తినడానికి అన్నం లేని వాడు, ఉన్న దానితో సంతృప్తి పడి సగం ఆకలితో నేల మీదనే బాగా నిద్రపోతున్నాడు.

Sunday, July 13, 2014

కోహం

దేహము నేనను భావము
ఊహకు రానీక బ్రతుకు, ఓర్చుము తపనన్
గేహము యజమానవునా
"కోహం" ప్రశ్నే తొలచును కోర్కెలఁ శాస్త్రీ

భా:- జీవి దుఃఖాలకు కారణం దేహాత్మబుద్ధి. అంటే "ఈ శరీరమే నేను" అనే భావం. ఆ భావాన్ని విడిచిపెడితే ఏ సమస్యా లేదు. మనం అరిషడ్వర్గాలు ఆరు అనుకున్నా వాటికి మూలం కోరికే (కామం). ఆ కోర్కెలను తొలగించుకునే మార్గం రమణ మహర్షి చెప్పినట్టు "ఎవరికీ కోరిక" అని ఆలోచించడమే. "నేను ఎవరిని" అనే ప్రశ్నే రగులుతున్న కోర్కెలను కడిగేస్తుంది. 

"నా శరీరం" అని మనం అనుకున్నప్పుడు "శరీరం నేను కాదు", అనే భావం తేట పడుతోంది కదా. ఇంట్లోంచి యజమాని గొంతు వినిపించనంత మాత్రాన ఇల్లే మాట్లాడుతోంది అనుకోవడం ఎంత వివేకమో శరీరం ద్వారా జీవుడి కర్మలు జరుగుతున్నందున ఆ శరీరమే జీవుడు అనుకోవడం కూడా అంతే వివేకం.

ఇదంతా చెప్పడానికి బాగుంది కానీ, నేను పూర్తిగా ఆచరించట్లేదు. ఈ రోజు గురు పౌర్ణిమ కాబట్టి "శ్రీ రమణ మహర్షి" బోధలను అనుసరించి ఈ పద్యం చెప్పటం జరిగింది.