Wednesday, March 28, 2018

శ్రీరామనవమి సందర్భంగా

కౌశికయాగరక్షకుని గౌతమ శాపవిదూరకారకున్
కేశనిబద్ధశీతకర కేతనచాపవిభంగకర్తనున్
దాశరథిన్ రమాసహితుఁ దానవ శిక్షకుఁ లోకపాలకున్
ఈశవిరించివందితుని హేలికులార్ణవచంద్రుఁ మ్రొక్కెదన్

గౌతమ శాప విదూర కారకుడు - గౌతముని యొక్క శాపం దూరం చేసినవాడు
కేశ నిబద్ధ శీతకర కేతన చాప విభంగ కర్త - జుట్టుతో కట్టబడిన చంద్రుడే తన గుర్తుగా కలిగిన వాని ధనుస్సును విరిచినవాడు
హేలి కుల అర్ణవ చంద్రుడు - సూర్యుని వంశం అనే కడలికి చంద్రుడు వంటివాడు

Sunday, January 28, 2018

ప్రజ్ఞాదీపం

నీ పాదంబులఁ మదిలో
రూపించితి భక్తిమీర రుచిరచరణ నా
పాపంబుఁ ద్రుంచి ప్రజ్ఞా
దీపంబును వెలుగజేయి తిరముగ రమణా!

Monday, October 10, 2016

వినయము, మౌనము, శాంతము,
పనిపై గురి, పరులు మేలుఁ బడయగ మనసున్
వెనుదిరుగని పట్టుదలయు,
నిను వీడకనుండఁ గోరు నిత్యము శాస్త్రీ

Saturday, August 27, 2016

నెత్తురు పలుచై, తలపై
కెత్తగనోపిక చాలక, యింద్రియములలో
సత్తువ కొదవైనపుడును
మెత్తగ పలుకరు మొరకులు మిడియుచు శాస్త్రీ

భా:- చిక్కిపోయినా, తలను పైకి ఎత్తే ఓపిక లేకపోయినా, ఇంద్రియాలపై అదుపు తప్పిపోయినా సరే సున్నితంగా మాట్లాడటం పొగరుబట్టిన మూర్ఖులకు చేతకాదు.

Sunday, September 13, 2015

అహం ఒక మహావృక్షం

అహమను మ్రానుకు తలపులు
గహనపు కొమ్మలు, వలపులు గాఢపు వేళ్ళున్
ఇహమాధారము, విషయపు
లహరియె వాయువు, వరుణము లౌల్యము శాస్త్రీ

భా:- అహమనే చెట్టుకి - ఆలోచనలు దట్టమైన కొమ్మలు, కోరికలు లోతైన వేరులు, ప్రపంచం ఆధారం, విషయాలు గాలి, (విషయాల పట్ల) ఆసక్తి నీరు. చెట్టు నేల, గాలి, నీరు ఆధారంగా వేళ్ళు, కొమ్మలు పెంచుకుంటుంది. అహం ప్రపంచం, విషయాలు, ఆసక్తి ఆధారంగా కోరికలను, ఆలోచనలను పెంచుకుంటూ ఉంటుంది.

Monday, August 18, 2014

ధనం - నిద్ర

ఉదరము నిండిన ధనికుడు
పదవికి పోరుచు పరుపున పడుకొనకుండన్
కదలగనోపిక కరువై
నిదురించును పేదవాడు నేలనె శాస్త్రీ

భా:- ఈ రోజు ధన, పదవీ కాంక్షలు విడ్డూరంగా ఉన్నాయి. లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు, పదవుల నిచ్చెన ఎక్కడానికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని త్యాగం చేస్తున్నారు. వాళ్ళకు పరుపున్నా నిద్ర పట్టదు. కడుపు నిండా తినడానికి అన్నం లేని వాడు, ఉన్న దానితో సంతృప్తి పడి సగం ఆకలితో నేల మీదనే బాగా నిద్రపోతున్నాడు.

Sunday, July 13, 2014

కోహం

దేహము నేనను భావము
ఊహకు రానీక బ్రతుకు, ఓర్చుము తపనన్
గేహము యజమానవునా
"కోహం" ప్రశ్నే తొలచును కోర్కెలఁ శాస్త్రీ

భా:- జీవి దుఃఖాలకు కారణం దేహాత్మబుద్ధి. అంటే "ఈ శరీరమే నేను" అనే భావం. ఆ భావాన్ని విడిచిపెడితే ఏ సమస్యా లేదు. మనం అరిషడ్వర్గాలు ఆరు అనుకున్నా వాటికి మూలం కోరికే (కామం). ఆ కోర్కెలను తొలగించుకునే మార్గం రమణ మహర్షి చెప్పినట్టు "ఎవరికీ కోరిక" అని ఆలోచించడమే. "నేను ఎవరిని" అనే ప్రశ్నే రగులుతున్న కోర్కెలను కడిగేస్తుంది. 

"నా శరీరం" అని మనం అనుకున్నప్పుడు "శరీరం నేను కాదు", అనే భావం తేట పడుతోంది కదా. ఇంట్లోంచి యజమాని గొంతు వినిపించనంత మాత్రాన ఇల్లే మాట్లాడుతోంది అనుకోవడం ఎంత వివేకమో శరీరం ద్వారా జీవుడి కర్మలు జరుగుతున్నందున ఆ శరీరమే జీవుడు అనుకోవడం కూడా అంతే వివేకం.

ఇదంతా చెప్పడానికి బాగుంది కానీ, నేను పూర్తిగా ఆచరించట్లేదు. ఈ రోజు గురు పౌర్ణిమ కాబట్టి "శ్రీ రమణ మహర్షి" బోధలను అనుసరించి ఈ పద్యం చెప్పటం జరిగింది.