Wednesday, December 26, 2007

ఏ బంధానికైనా నమ్మకం ముఖ్యం

ఏకతమాడుచు తెల్పుము
ఆకూతంబులనగూఢభావముదోడన్
ఏకీభావంబువినా
చీకటిలో వెదకులాట చెలిమియె శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ఏకతమాడు = ఏకాంతంలో మాట్లాడు (తగిన సందర్భంలో)
ఆకూతము = అభిప్రాయము, కోరిక
అగూఢభావము = దాపరికము లేకుండా
ఏకీభావము = ఐక్యత, ఏకాభిప్రాయము
వినా = లేకుండా

భావము:
--
ఏదైనా బంధానికి ఇరువర్గాలూ వారి అభిప్రాయాలను తేటపరచాలి. లేనిచో ఆ బంధం - ముసుకులో గుద్దులాటలాగా ఉంటుంది. నిజమైన చెలిమి సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగిస్తే, ఇలాంటి (పరస్పరం అవగాహన లేని) చెలిమివలన బాధ, అశాంతి కలుగుతూ ఉంటాయి.

అలాగని, అభిప్రాయాల్ని ఎక్కడబడితే అక్కడ తెలుపరాదు. సరియైన సందర్భం, చోటూ చూసుకుని చర్చించుకోవాలి.

Thursday, December 20, 2007

అంగములను అధిగమించుట అవఘళము

దబ్బర తెలియని వెకలియు
బిబ్బోకములెరుగలేని పేడియు పుణ్యుల్
ప్రెబ్బొత్తిగ వీరు నయము
కిబ్బిషములు జేయలేరు కెలవున శాస్త్రీ

కొన్ని పదములక అర్థములు:
--
దబ్బర = మోసము, అబద్ధము
వెకలి = పిచ్చివాడు, వెర్రివాడు
బిబోకము = శృంగార చేష్ట
ఎరగు = గ్రహించు
పేడి = నపుంసకుడు (ఆడ, మగ కాని మనిషి)
పుణ్యుడు = పవిత్రమైనవాడు
ప్రెబ్బొత్తిగ = నిశ్చయముగ
నయము = ఉన్నతము
కిబ్బిషము = పాపము
కెలవు = సంభోగేచ్ఛ

భావము:
--
పిచ్చివాళ్ళు, నపుంసకులు కామోద్రేకంతో, స్వార్థంతో తప్పిదములు, అధర్మములు చేసేవారి కంటే అదృష్టవంతులు. వారికి తప్పు చేసే అవకాశం ఉందని గాని, దాని వలన వారికి కలిగే తాత్కాలికమైన లాభముల గురించిగాని తెలియదు.

Sunday, December 9, 2007

పుట్టిన రోజున పుట్టెడు పుణ్యం చేయాలి

పట్టెడు కూడనువారికి
పెట్టక బలిసిన హితులకు విందనియనుచున్
వట్టిగ కాసులు విసురుచు
పుట్టినరోజని మురియుట మూఢము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
పట్టెడు = అరచేతినిండుగ
కూడు = అన్నం, తిండి
వట్టిగ = వృథాగ
కాసులు = ధనము
మూఢము = అఙానము

భావము:
--

పుట్టినరోజు పూట ఆకలితో ఉన్న నలుగురు పేదలకు అన్నం పెట్టకుండా - తెగబలిసిన బంధువులకూ, మిత్రులకూ డబ్బు వెదజల్లి విందులు అందించడం, అది చూసి మురిసిపోవటం - కేవలం అఙానం.

ఐతే నా వాదన: "అయినవారి మీద అభిమానం చూపవద్దు", అని కాదు. "లేనివారికి ఉన్న అవసరాన్ని గుర్తించి, మానవత్వం చూపి, మనిషిగా పుట్టిన రోజును గుర్తు చేసుకోవాలి", అని నా ఉద్దేశం.

ఈ రోజు, తిథుల ప్రకారం నా పుట్టినరోజు! అందుకే సందర్భోచితంగా...

Saturday, December 8, 2007

ఒక వయసు తరువాత డబ్బు విషయాలు విడిచిపెట్టాలి

ధనమున సురలను మించిన
తనయులు శ్రీమంతులయిన తనియక యటుపై
మనుమలు మనువాడుదాక
మనమున హరి కానరాడు మనిషికి శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
సురలు = దేవతలు (క్షీరసాగరం మథించిన తరువాత సిరులను పొందిన వారు)
తనియు = తృప్తి చెందు
మనువాడు = పెండ్లి చేసుకొను
హరి = నారాయణుడు (పరమాత్ముడు)

భావము:
--
నూటికి తొంభై శాతం మంది - కాళ్ళూ చేతులూ ఆడినంత కాలం డబ్బు సంపాదించడం మీదనే ధ్యాస నిలుపుతారు (ఎంత సంపాదించినా). నామమాత్రంగా పరమాత్ముణ్ణి ధ్యానించినా వారి మనసులో డబ్బు ఊసు మెదులుతూనే ఉంటుంది.

ఇలా జీవితమంతా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటూనే ఊండి, ఇక రేపో మాపో అనగా, ఉన్నట్టుండి నారాయణమంత్రం జపిస్తారు. మరి వారిద్దరూ ఒకే చోట ఉండి, అన్నీ చూస్తూ, ఏమనుకుంటారో!

Monday, December 3, 2007

ప్రతి రోజూ ఒక పాఠమే

మతిమంతుడు భంగపడిన
చతికిలబడకయు పెరిగిన చైతన్యముతో
గతమున పొరపాటులెరిగి
అతిశీఘ్రంబుగ కడచును గండము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
మతిమంతుడు = తెలివైనవాడు
భంగపడు = ఓడిపోవు, అవమానింపబడు
చతికిలబడు = ఓటమినంగీకరించు, కిందపడిపోవు
చైతన్యము = తెలివి, స్ఫూర్తి
అతిశీఘ్రంబు = మిక్కిలి వేగంగా
గండము కడచు = కష్టాలన్ని (అవరోధాన్ని) దాటు

భావము:
--
ఏదైనా పనికి పూనుకున్నప్పుడు, అనుకోని అవరోధం ఎదురైతే - అది చూసి నిర్వీర్యులై ఆగిపోరాదు. మరింత ఉత్సాహంతో, పట్టుదలతో మనం గతంలో చేసిన పొరపాటులు తెలుసుకొని, సవరించుకొని ముందుకు వెళ్ళాలి - ఆ అవరోధాల్ని జయించాలి.

నాకు వెంటనే ఆంజనేయుని సాహసం గుర్తుకు వస్తోంది. లక్ష్మణుని కోసం సంజీవిని తీసుకురావడానికి వెళ్ళి అక్కడ ఆ మూలికను గుర్తించలేక వెనక్కి తిరిగిరాలేదు. మొత్తం కొండనే తీసుకువచ్చాడు. అందుకే రాముడు సైతం ఆంజనేయుడు తన సేనలోకల్ల తెలివైనవాడని, మాటకారి అని, చదువరి అని పొగిడాడు. హనుమంతుని మీద ఉన్నంత నమ్మకం రామునికి వేరెవ్వరి మీదా లేదు.

Saturday, December 1, 2007

ఆప్యాయతను అనుభవిస్తేనే అది జీవితం

ఆగమములనెల్ల నుడువు
లాగము గల్గిన సుగుణుడు లక్ష్మణుడైనన్

రాగము చవిచూడక యే

త్యాగము జేయక బ్రతుకుట దండుగ శాస్త్రీ


కొన్ని పదాలకు అర్థాలు:
--
ఆగమము = వేదము
నుడువు = చెప్పు
లాగము = లాఘవము (నేర్పు)
లక్ష్మణుడు = సిరిగలవాడు
రాగము = అభిమానము
చవిచూచు = అనుభవించు, రుచి చూడు


భావము:
--

ఎంత చదువు, సంపదా ఉన్నా కూడా - అభిమానించేవారు లేకుండా - మరొకరి ఆరాధించకుండా ఉండే జీవితం వృథా. మన మంచి కోరి తమ సుఖాలను వీడేవారి అనురాగం అమూల్యం. మన సుఖం వదులుకుని మన ఆత్మీయుల సంతోషం చూసి ఆనందించటంలో ఉన్న తృప్తి అనిర్వచనీయం. ఈ రెండింటినీ అనుభవించని జీవితం అసంపూర్ణం - నిరర్థకం.

ఇలాంటి అనుబంధాలను రామయణంలో నేను బాగా గమనించాను: తండ్రి మాటల కోసం రాజ్యాన్ని వదిలి అడవుకి పోయే కొడుకు, భర్త సాన్నిధ్యం కోసం రాణీవాసం వదిలే భార్య, అన్న సాన్నిధ్యం కోసం భార్యను విడిచి జీవించే తమ్ముడు, భర్త ఆఙ మేరకు అత్తలకు సేవ చేస్తూ విరహం అనుభవించే భార్య -- ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైన ఉదాహరణలు కనబడతాయి.