Wednesday, December 26, 2007

ఏ బంధానికైనా నమ్మకం ముఖ్యం

ఏకతమాడుచు తెల్పుము
ఆకూతంబులనగూఢభావముదోడన్
ఏకీభావంబువినా
చీకటిలో వెదకులాట చెలిమియె శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ఏకతమాడు = ఏకాంతంలో మాట్లాడు (తగిన సందర్భంలో)
ఆకూతము = అభిప్రాయము, కోరిక
అగూఢభావము = దాపరికము లేకుండా
ఏకీభావము = ఐక్యత, ఏకాభిప్రాయము
వినా = లేకుండా

భావము:
--
ఏదైనా బంధానికి ఇరువర్గాలూ వారి అభిప్రాయాలను తేటపరచాలి. లేనిచో ఆ బంధం - ముసుకులో గుద్దులాటలాగా ఉంటుంది. నిజమైన చెలిమి సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగిస్తే, ఇలాంటి (పరస్పరం అవగాహన లేని) చెలిమివలన బాధ, అశాంతి కలుగుతూ ఉంటాయి.

అలాగని, అభిప్రాయాల్ని ఎక్కడబడితే అక్కడ తెలుపరాదు. సరియైన సందర్భం, చోటూ చూసుకుని చర్చించుకోవాలి.

Thursday, December 20, 2007

అంగములను అధిగమించుట అవఘళము

దబ్బర తెలియని వెకలియు
బిబ్బోకములెరుగలేని పేడియు పుణ్యుల్
ప్రెబ్బొత్తిగ వీరు నయము
కిబ్బిషములు జేయలేరు కెలవున శాస్త్రీ

కొన్ని పదములక అర్థములు:
--
దబ్బర = మోసము, అబద్ధము
వెకలి = పిచ్చివాడు, వెర్రివాడు
బిబోకము = శృంగార చేష్ట
ఎరగు = గ్రహించు
పేడి = నపుంసకుడు (ఆడ, మగ కాని మనిషి)
పుణ్యుడు = పవిత్రమైనవాడు
ప్రెబ్బొత్తిగ = నిశ్చయముగ
నయము = ఉన్నతము
కిబ్బిషము = పాపము
కెలవు = సంభోగేచ్ఛ

భావము:
--
పిచ్చివాళ్ళు, నపుంసకులు కామోద్రేకంతో, స్వార్థంతో తప్పిదములు, అధర్మములు చేసేవారి కంటే అదృష్టవంతులు. వారికి తప్పు చేసే అవకాశం ఉందని గాని, దాని వలన వారికి కలిగే తాత్కాలికమైన లాభముల గురించిగాని తెలియదు.

Sunday, December 9, 2007

పుట్టిన రోజున పుట్టెడు పుణ్యం చేయాలి

పట్టెడు కూడనువారికి
పెట్టక బలిసిన హితులకు విందనియనుచున్
వట్టిగ కాసులు విసురుచు
పుట్టినరోజని మురియుట మూఢము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
పట్టెడు = అరచేతినిండుగ
కూడు = అన్నం, తిండి
వట్టిగ = వృథాగ
కాసులు = ధనము
మూఢము = అఙానము

భావము:
--

పుట్టినరోజు పూట ఆకలితో ఉన్న నలుగురు పేదలకు అన్నం పెట్టకుండా - తెగబలిసిన బంధువులకూ, మిత్రులకూ డబ్బు వెదజల్లి విందులు అందించడం, అది చూసి మురిసిపోవటం - కేవలం అఙానం.

ఐతే నా వాదన: "అయినవారి మీద అభిమానం చూపవద్దు", అని కాదు. "లేనివారికి ఉన్న అవసరాన్ని గుర్తించి, మానవత్వం చూపి, మనిషిగా పుట్టిన రోజును గుర్తు చేసుకోవాలి", అని నా ఉద్దేశం.

ఈ రోజు, తిథుల ప్రకారం నా పుట్టినరోజు! అందుకే సందర్భోచితంగా...

Saturday, December 8, 2007

ఒక వయసు తరువాత డబ్బు విషయాలు విడిచిపెట్టాలి

ధనమున సురలను మించిన
తనయులు శ్రీమంతులయిన తనియక యటుపై
మనుమలు మనువాడుదాక
మనమున హరి కానరాడు మనిషికి శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
సురలు = దేవతలు (క్షీరసాగరం మథించిన తరువాత సిరులను పొందిన వారు)
తనియు = తృప్తి చెందు
మనువాడు = పెండ్లి చేసుకొను
హరి = నారాయణుడు (పరమాత్ముడు)

భావము:
--
నూటికి తొంభై శాతం మంది - కాళ్ళూ చేతులూ ఆడినంత కాలం డబ్బు సంపాదించడం మీదనే ధ్యాస నిలుపుతారు (ఎంత సంపాదించినా). నామమాత్రంగా పరమాత్ముణ్ణి ధ్యానించినా వారి మనసులో డబ్బు ఊసు మెదులుతూనే ఉంటుంది.

ఇలా జీవితమంతా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటూనే ఊండి, ఇక రేపో మాపో అనగా, ఉన్నట్టుండి నారాయణమంత్రం జపిస్తారు. మరి వారిద్దరూ ఒకే చోట ఉండి, అన్నీ చూస్తూ, ఏమనుకుంటారో!

Monday, December 3, 2007

ప్రతి రోజూ ఒక పాఠమే

మతిమంతుడు భంగపడిన
చతికిలబడకయు పెరిగిన చైతన్యముతో
గతమున పొరపాటులెరిగి
అతిశీఘ్రంబుగ కడచును గండము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
మతిమంతుడు = తెలివైనవాడు
భంగపడు = ఓడిపోవు, అవమానింపబడు
చతికిలబడు = ఓటమినంగీకరించు, కిందపడిపోవు
చైతన్యము = తెలివి, స్ఫూర్తి
అతిశీఘ్రంబు = మిక్కిలి వేగంగా
గండము కడచు = కష్టాలన్ని (అవరోధాన్ని) దాటు

భావము:
--
ఏదైనా పనికి పూనుకున్నప్పుడు, అనుకోని అవరోధం ఎదురైతే - అది చూసి నిర్వీర్యులై ఆగిపోరాదు. మరింత ఉత్సాహంతో, పట్టుదలతో మనం గతంలో చేసిన పొరపాటులు తెలుసుకొని, సవరించుకొని ముందుకు వెళ్ళాలి - ఆ అవరోధాల్ని జయించాలి.

నాకు వెంటనే ఆంజనేయుని సాహసం గుర్తుకు వస్తోంది. లక్ష్మణుని కోసం సంజీవిని తీసుకురావడానికి వెళ్ళి అక్కడ ఆ మూలికను గుర్తించలేక వెనక్కి తిరిగిరాలేదు. మొత్తం కొండనే తీసుకువచ్చాడు. అందుకే రాముడు సైతం ఆంజనేయుడు తన సేనలోకల్ల తెలివైనవాడని, మాటకారి అని, చదువరి అని పొగిడాడు. హనుమంతుని మీద ఉన్నంత నమ్మకం రామునికి వేరెవ్వరి మీదా లేదు.

Saturday, December 1, 2007

ఆప్యాయతను అనుభవిస్తేనే అది జీవితం

ఆగమములనెల్ల నుడువు
లాగము గల్గిన సుగుణుడు లక్ష్మణుడైనన్

రాగము చవిచూడక యే

త్యాగము జేయక బ్రతుకుట దండుగ శాస్త్రీ


కొన్ని పదాలకు అర్థాలు:
--
ఆగమము = వేదము
నుడువు = చెప్పు
లాగము = లాఘవము (నేర్పు)
లక్ష్మణుడు = సిరిగలవాడు
రాగము = అభిమానము
చవిచూచు = అనుభవించు, రుచి చూడు


భావము:
--

ఎంత చదువు, సంపదా ఉన్నా కూడా - అభిమానించేవారు లేకుండా - మరొకరి ఆరాధించకుండా ఉండే జీవితం వృథా. మన మంచి కోరి తమ సుఖాలను వీడేవారి అనురాగం అమూల్యం. మన సుఖం వదులుకుని మన ఆత్మీయుల సంతోషం చూసి ఆనందించటంలో ఉన్న తృప్తి అనిర్వచనీయం. ఈ రెండింటినీ అనుభవించని జీవితం అసంపూర్ణం - నిరర్థకం.

ఇలాంటి అనుబంధాలను రామయణంలో నేను బాగా గమనించాను: తండ్రి మాటల కోసం రాజ్యాన్ని వదిలి అడవుకి పోయే కొడుకు, భర్త సాన్నిధ్యం కోసం రాణీవాసం వదిలే భార్య, అన్న సాన్నిధ్యం కోసం భార్యను విడిచి జీవించే తమ్ముడు, భర్త ఆఙ మేరకు అత్తలకు సేవ చేస్తూ విరహం అనుభవించే భార్య -- ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైన ఉదాహరణలు కనబడతాయి.

Monday, November 26, 2007

మాటలాడే పద్ధతి

తిరముగ తెలిసిన విషయము
నెరవుగ జెప్పుట తగునని నీవెరిగినచో
ఇరువురి సౌఖ్యము గోరుచు
పరులను బాధింపకుండ పల్కుము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
తిరముగ = స్థిరముగ
నెరవుగ = నిశ్చయంగ
ఇరువురి = చెప్పెడివాని, వినెడివాని
సౌఖ్యము = సంతోషము, మంచి

భావము:
--

మనం చెప్పబోయే విషయం నిజమని, అది అవసరం అని తెలిస్తే - అప్పుడు మన మంచితో పాటూ, వినెడి వారి మంచిని కోరుతూ - ఇతరులను బాధింపకుండా చెప్పదగును.

ఏదైనా విషయం ప్రస్తావించేటప్పుడు నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి :
౧. ఇది నిజమా?
౨. ఇది చెప్పడం అవసరమా?
౩. ఇది వినేవాడికేమైనా ఉపయోగం ఉందా? లేక, నాకు ఏమైనా ఉపయోగం ఉందా?
౪. ఇది నేను చెప్పుటజేత వేరొకరు బాధపడరు కద?

ఈ ప్రశ్నలు నిశ్చయంగా మన మాటల వలన ఏ అనర్థాలను రాకుండా చూస్తాయి.

అసలు మనిషికి ఉన్న శత్రువులు ఇంద్రియాలు. వీటి వలనే మనం కర్మలను ఆచరిస్తాము. వాటి ఫలితాలను అనుభవిస్తాము. వీటిలో మనసు, నోరు అన్నిటికన్న గొప్ప శత్రువులు. వీటిని గనుక మనం అదుపులో పెట్టుకుంటే సగానికి పైగా ప్రపంచాన్ని జయించినాట్టే!


నిజానికి నేను ఈ పద్యము వ్రాసి చాలా రోజులయినా ఇక్కడ ప్రస్తావించకపోవడానికి ఒక కారణం ఉంది. నేను స్వయంగా అన్ని సందర్భాలలోనూ ఆచరించని విషయం వ్రాయడంలో అర్థం లేదు. అందుకు. ఎప్పటికప్పుడు "అయ్యో! ఆ మాట అనవసరంగా అన్నానే", అనుకుంటూనే ఉంటాను.

అయినా, జీవితంలో తనకు తాను నచ్చాలంటే యోగి అయ్యి ఉండాలి (కర్మ యోగి, భక్తి యోగి, ధ్యాన యోగి మొ) - లేక మూర్ఖుడైనా అయ్యి ఉండాలి. రెండవది తెలుసుకోవడం అనుకున్నంత సులువు కాదు. ముందుది సాధించడం చెప్పినంత సులువు కాదు. అందుకే చాలా మంది మంచివారు, తమలో తమకు నచ్చని గుణాలకు బాధపడుతుంటారు. నేను మంచివాడినో కానో తెలియదు కానీ - మంచివానిగా ఉండాలి అనుకుంటున్నాను - నాకు నేను పూర్తిగా నచ్చను. ఇక ఇదంతా ఎందుకు చెబుతున్నాను - అంటే నేను పూర్తిగా ఆచరించని విషయం - ఇతరులకు చెబితే పూర్తిగా ఆచరించగలగవచ్చు. అందుకే నేను నేర్చుకున్న విషయాలను ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ వ్రాస్తున్నాను.

Friday, November 9, 2007

ఆత్మవిమర్శ అవసరం కానీ ఆత్మస్తుతి ప్రమాదకరం

గొప్పగ చేసిన కార్యము
చప్పున మరచుటె యుచితము సత్పురుషునకున్
తప్పులనెరగుటకు వినా
ఒప్పదు గతమును తలచుట గుణులకు శాస్త్రీ


కొన్ని పదాలకు అర్థాలు:
--

చప్పున = వెంటనే
ఉచితము = నప్పునది, తగినది
వినా = తప్ప (నిను వినా = నువ్వు తప్ప)
ఒప్పు = శోభించు
గుణులకు = సద్గుణములు కలవారు

భావము:
--
మనం గతంలో సాధించిన ఘనతను గుర్తు తెచ్చుకుని పొంగిపోవటం కానీ, చేసిన పొరపాటులను తలచుకుని దు:ఖించడం కానీ వృథా. ఐతే పొరపాటులను తెలుసుకుని సరిదిద్దుకోవడానికి గతం బాగా ఉపయోగపడుతుంది. ఇందుకే గతాన్ని మనం ఒక గ్రంధంలాగా భావించి - అవసరమైన విషయాలను తెలుసుకోవడానికి తెరవాలి.

Friday, November 2, 2007

ఆత్మీయులను బెదిరించరాదు - ఆదరించాలి

అచ్చికములనొప్పక యే
మచ్చిక మాటలు పలుకక మదినొప్పింపన్
చచ్చెదననువాని విడక
ఉచ్చుననుంచెడి వరుసలు గూడకు శాస్త్రీ||

అర్థములు:
--
అచ్చికము = లేమి (తనదగ్గర లేనిది)
ఒప్పక = ఒప్పుకోకుండా
మచ్చిక + మాటలు = అభిమానంతో కూడిన పలుకులు
మది + నొప్పింపన్ = మనసు నొప్పించడానికి
చచ్చెదననువాని = "నేను చచ్చిపోతాను" అని బెదిరించెడివాని
ఉచ్చు = ఉరి, వల, ఇరకాటం
వరుస = సంబంధం
కూడు = కలుపుకొను

భావం:
--
తన తప్పు ఉంటే అది ఒప్పుకోక, (లేక, అవతలవారి తప్పు ఉంటే) అభిమనంతో కూడిన మాటలు చెప్పి ఒప్పించకుండా, "నేను చచ్చిపోతాను", "నేను ఇల్లు విడిచిపోతాను" అని అంటూ ఉండెడివానితో బంధం - వలలో కాపురం వంటిది.

అందుకే వారియందు రాగం విడచిపెట్టి, వారికి దూరంగా ఉండాలి - లేక కఠువుగా ప్రవర్తించి వారికి బుద్ధి చెప్పాలి (వారు వింటే).

ఉదాహరణగా దుర్యోధనుణ్ణి తీసుకుందాం: ధృతరష్ట్రుడు స్వయంగా ధర్మం తెలిసినా కొడుకు ప్రాయోపవేశం చేస్తాను అని బెదిరించడం వలన అశక్తుడైనాడు. హాని కొడుకుకే జరిగినా - బాధపడ్డది తల్లిదండ్రులు కూడా. ఇక పొరపాటు ఏమిటి అంటే: ఆ కొడుకు ఆగడాలను సహిస్తూ తన చెంతనే ఉండటం - దానివలన దుర్యోధనునికి ఎక్కడో కొంత ధైర్యం చేకూరింది. (సరే - తప్పులు పట్టడం సులువు అనుకోండి.)

ఇలాంటి "ఆత్మహత్య" బెదిరంపులు నేను సహజంగా ఆడువారి నోట వింటే - మగవారు తాము ఇల్లు విడిచి వెళ్ళిపోతామని బెదిరించడం చూశాను. ఏది ఏమైనా - ఆత్మీయులు అర్థం చేసుకోవాలి/తెలియజెప్పాలి కానీ చేసుకోవాలి కానీ అధికారం చూపకూడదు - ఆగడం చెయ్యకూడదు. ఒకవళ వినకపోతే అటువంటివారిని వడిచి పెట్టడమే సబబు.

Saturday, October 20, 2007

చెడ్డబుద్ధి కలిగినవానికి చేసే ఙానబోధ వృధా

అనలుని చేరిన యాజ్యము
వనధిని కలిసిన వరుణము వక్రాత్మునకున్
దొనరగ మప్పిన ధర్మము
కనపడవో క్షణము పిదప కానర శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
అనలుడు = అగ్నిదేవుడు
ఆజ్యము = నెయ్యి
వనధి = సముద్రము
వరుణము = నీరు
వక్రాత్ముడు = చెడ్డ బుద్ధి కలవాడు
దొనరగ = చక్కగ
మప్పు = నేర్పించు
పిదప = తరువాత
కాను = గ్రహించు

భావము:
--
అగ్నిలో పోసిన నెయ్యి, సముద్రములో కలిసిన నీరు, మూర్ఖుడికి మప్పిన నీతులు ఒక్క నిముషము తరువాత కనబడవు.

అగ్నిలో ఎంత నెయ్యి పోసినా ఆవిరైపోతుంది. చెరుకురసం తెచ్చి సముద్రములో కలిపినా ఉప్పగానే ఉంటుంది. అలాగే పొగరు నిండిన మనసులో నీతిని ఉంచుదామనుకున్నా మాయమవుతుంది. మన సమయం మాత్రం వృథా అవుతుంది.

పోరాటం చేసే ముంది ఆలోచించాలి

తగు సమయము గమనించక
పగవారల బలిమి గనక ఫలమెంచక తా
పొగరుగ తలబడు మొరకుడు
నగవులపాలై కడచును నష్టము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
పగవారు = శత్రువులు
బలిమి = శక్తి
కను = చూడు
ఎంచు = అంచనా వేయు
మొరకుడు = మూర్ఖుడు
నగవులపాలవ్వు = నవ్వులపాలవ్వు
కడచు = అనుభవించు, నశించు

భావము:
--
ఒకరితో పోరే ముందు, మన శక్తినీ, వారి శక్తినీ అంచనా వెయ్యాలి. తగిన సమయము చూసుకొని ముందడుగు వేయాలే తప్ప, పొగరుగానో ఆవేశంగానో ముందుకు పోకూడదు. మనకి వచ్చే ప్రయోజనం కంటే ఎక్కువ శ్రమపడితే మనం ఓడిపోయినట్లే. మంచిచెడులు చూసుకోకుండా తెగించి ఓడిపోయినవారిని చూసి నలుగురూ నవ్వుతారు కూడా.

నా బాల్యంలో "ఏడు ఘడియల రాజు" అనే కథ చదివాను. అందులో ఒకని జాతకంలో ఏడు ఘడియల పాటు రాజుగా ఉండాలి అని వ్రాసిపెట్టి ఉంటుంది. వాడు ఒకానొక రాజు మీద దండెత్తగా ఆ రాజు ఈ విషయం తెలుసుకుని, రాజ్యం వానికి ఇచ్చేసి, ఏడు ఘడియల తరువాత తిరిగి దండెత్తుతాదు. దానితో "ఏడు ఘడియల రాజు" కథ సమాప్తం. ఇక్కడ తగిన సందర్భం చూసుకున్న రాజు ఓడినట్లు కనబడినా నెగ్గాడు.

భారతంలో కృష్ణుడు, ఒక పురోహితుణ్ని రాయబారిగా, దుర్యోధనుడికి చెబుతాడు: "నువ్వు పాండవుల సేన ఏడు అక్షౌహిణిల సేన అనుకుంటున్నావు. నీది పదకొండు కదా అని విర్రవీగుతున్నావు. కానీ సాత్యకీ, భీమ, నకుల, సహదేవులు ఒక్కొక్కరూ ఒక్కొక్క అక్షౌహిణీ సేనకు సమానం. ఇక అర్జునుడు, శ్రీకృష్ణుడు ఉంటే వారి ముందు మీ సేన నిలబడనే లేదు", అని. ఇక్కడ దుర్యోధనుడు మిక్కిలి తెలివైన, రాజకీయం తెలిసినవాడైనా, పొగరుతో అవతలవారి శక్తిని సరిగ్గా అంచనా వెయ్యలేకపోయాడు.

Sunday, October 14, 2007

అనుబంధం సంబరంలాగా ఉండాలి

చనుబాలీయని తల్లులు
కనుపాపను రెప్పవోలె కాయని తండ్రుల్
కినుకవహించెడి దారలు
ధనమాశించెడి తనయులు దైత్యుల్ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
కినుక = కోపము
వహించు = ధరించు
దార = భార్య
తనయులు = పుత్రులు
దైత్యులు = రాక్షసులు

భావము:
--
చనుబాలిచ్చి పిల్లల్ని పెంచని తల్లి, కనుపాపని రెప్ప ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా పిల్లల్ని కాపాడని తండ్రి, ఎప్పుడూ కోపం ప్రదర్శించే భార్య, తల్లిదండ్రులనుండి సంపదలాశించే పిల్లలు రాక్షసులతో సమానం.

ఇక్కడ చనుబాలియ్యడం అనే దానిని అచ్చంగా తీసుకోవద్దు. చనుబాలు శ్రద్ధకు, శుద్ధతకు, మమకారానికీ చిహ్నం. తల్లికి పిల్లల పట్ల అవన్నీ ఊండాలి అని ఉద్దేశం.

నీచులతో వాదన వృథా అవుతుంది

అల్పుని కడ వాదించకు
కల్పుకొనెడి మాట విడచి ఘనముగ పల్కున్
సల్పు కలుగు చందంబున
గెల్పు కడకు వానిదౌను ఖిలముర శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
అల్పుడు = నీచుడు, దుర్బుద్ధి కలిగిన వాడు
ఘనముగ = హద్దు లేకుండా, విరివిగ
సల్పు = బాధ, నొప్పి
చందంబు = విధంబు
కడకు = చివరకు
ఖిలము = వృథా

భావము:
--
నీచులతో వాదించి ఉపయోగం ఉండదు. వారి మాట వారిదే కానీ పక్కవాడి మాట వినరు. పైగా, మనం చెప్పిన మంచిమాటలు కూడా పెడచెవిని పెట్టి తగువు మాటలు మాట్లాడతారు. ఏదో ఒక విధంగా గెలుపు వారిదే అనిపించుకుంటారు. వాదించినవారి పరువు కూడా చెడుతుంది. అందుకే వారికి వీలైనంత దూరంగా ఉండాలి.

విజేతకి నిరంతరసాధన అవసరం

ఎంతటి కోవిదుడైన ని
-రంతరసాధన నెరపక రంజింపడెటన్
వృంతము తుంపదు నూరక
గొంతులఁ ఖండించు గండ్రగొడ్డలి శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
కోవిదుడు = పండితుడు, విద్యను బాగుగా నేర్చినవాడు
నిరంతర + సాధన = తరచూ పరిశ్రమిస్తూ ఉండుట
నెరపు = చేయు
రంజింపడు + ఎటన్ = ఎక్కడా వెలుగుడు (జయించడు)
వృంతము = (పువ్వు/ఆకు యొక్క) తొడిమె
నూరు = పదును చేయు
గండ్రగొడ్డలి = పెద్ద గొడ్డలి (పరశురాముడు ఆయుధంగా వాడేవాడు)

భావము:
--
మనుషుల గొంతులు నరికే గొడ్డలి సైతం నూరుతూ ఉండకపోతే కొన్నాళ్ళకు పదును పోయి తొడిమెలు కూడా తుంపలేదు. అలాగే ఎంతటి విద్యావంతుడైనా నిరంతరం సాధన చేయకుంటే ఏదో ఒక రోజు ఓటమిపాలవుతాడు.

Saturday, October 13, 2007

మగవాడికి తెగువ ఉండాలి

భగభగ రగిలించతరము
చిగురులనైనన్ తడిసిన చిదుగులనైనన్
తెగువే మాత్రము జూపని
మగనిని సహియింపరాదు మగువకు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
రగిలించు = మండించు
చిదుగులు = ఇంధనంగా వాడే పుల్ల
తెగువ = సాహసము, పట్టుదల
మగువ = స్త్రీ

భావము:
--
స్త్రీ పచ్చి ఆకులనూ, తడిసిపోయిన పుల్లలనూ ఐనా వెలిగించగలదు (వంటలో భాగంగా). కానీ, సాహసం లేకుండా ఎప్పుడూ భయపడుతూ, ముందుచూపు లేకుండా ప్రవర్తించే భర్తను మాత్రం భరించలేదు.

భర్త భార్యకు రక్షణగా ఉంటాడు కాబట్టి "భరించేవాడు" అన్నారు. అలాగ కాకుండా ఆపద నెత్తి మీదకు వచ్చే వరకు ఊరుకున్నా, వచ్చాకా ఎదుర్కోనడానికి తెగువ చూపలేకున్నా వాడిని భర్త అనడం వృథా!

Wednesday, October 10, 2007

మనిషిని శీలం చూసి గౌరవించాలి

వంక నడత గలవానిన్
శంక విడిచి నమ్మవచ్చు శత్రువునైనన్
పొంకముగని నమ్మకుమీ
బొంకులఁ మరిగిని మగువలు బుద్ధులఁ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
వంక = చెడ్డ
నడత = నడవడి
శంక = అనుమానం
పొంకము = అందము
బొంకులు = అబద్ధములు

భావము:
--
మొదలుగా, ఇది చదివే ఆడువారందరూ నన్ను క్షమించాలి. "ఎందుకు ఆడువారి మీద వ్రాస్తాడు వీడు - స్త్రీద్వేషి వీడు", అనుకోకండి. నేను పురుషుల మీద కూడా వ్రాశాను సుమీ.

భావం విషయానికి వస్తే, ఇది: మోసగాడు ఐనా శత్రువుని నెరనమ్మవచ్చు కానీ, అందం చూసి అబద్ధమాడే ఆడుదానిని మాత్రం నమ్మకూడదు.

కొంతమంది మగవారికి ఆడువారు అందంగా కనబడితే వారు చేసే తప్పులు కనబడకపోవచ్చు. అటువంటివారికోసమే ఇది. ఆడువారు అబద్ధం ఆడితే అది జీవితాలనే మార్చేయగలదు. అందులొనూ అతిముఖ్యంగా వారిని అందరూ నమ్ముతారు. "ఆడబిడ్డ అబద్ధం ఎందుకు ఆడుతుంది", అని. అందుకే అబద్ధం ఆడే ఆడవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

అంటే మగవారు అబద్ధాలు ఆడరా అంటే - నా జీవితంలో అతినీచమైన అబద్ధాలు ఆడిన మగవారినీ చూశాను. ఐతే వాళ్ళకు ఆడువారికి ఉండే "అయ్యో, ఆడబిడ్డ", అనే జాలి దక్కదు. వారికి చూడగానే అందంతో ఆకట్టుకునేంత విషయం కూడా ఉండదు - అని నా అనుమానం. ఆ వీషయం ఆడువారికే తెలుస్తుంది.

Tuesday, October 9, 2007

భార్యాబిడ్డల క్షేమం చూసుకోవడం భర్త ప్రథమకర్తవ్యం

ఆలిసుతులనేలనిపతి
ఆలిని నెరనమ్మని పతి, యాపదనందున్
బేల పలుకులాడెడిపతి
గాలికి తిరిగెడి పతి, పతి గాడుర శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
నెరనమ్ము = పూర్తిగా నమ్ము
బేల = భయపడిన

భావము:
--
పెళ్ళాంబిడ్డల్ని ఏలుకోనివాడు, భార్యపైన విశ్వాసం వాడు, కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోయేవాడు, ఇంటిపట్టున ఉండకుండా వీధిలో తిరుగుతూ ఉండేవాడు - భర్త కానే కాదు.

భర్తకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం తన కుటుంబాన్ని రక్షించుకుంటూ ఉండడం. దానికి ముఖ్యాంగా దోహదపడేది భార్యను గౌరవించి ఆదరించడం.

Sunday, October 7, 2007

భార్యాభర్తల మధ్య గౌరవం ఉండాలి

పెలుచగ పలుకుట, భర్తను
చులకన జేయుట, యునికిని చూడక మగడిన్
పలువురిలోనెదిరించుట
కులసతులకు కాదు పాడి, కూడదు శాస్త్రీ

కొన్ని పదములకు అర్థములు:
--
పెలుచగ = కఠినంగా
ఉనికి = పరిస్థితి
కులసతి = గౌరవించదగిన ఇల్లాలు
పాడి = ధర్మము
కూడదు = తప్పు, చేయరాదు

భావము:
--
భర్తతో కఠినంగా మాట్లాడటం, భర్తను గురించి ఎంత సన్నిహితలదగ్గరైనా తక్కువగా మాట్లాడటం, చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించకుండా భర్తను నలుగురిలో ఎదిరించి మాట్లాడటం గౌరవించదగిన ఇల్లాలు చెయ్యదు. అలాగ చేసే ఆడువారు (తమది, తమ భర్తది, తమ ఇంటిది) గౌరవాన్ని కోల్పోతారు.

నేను భార్యాభర్తల గురించి వ్రాసిన పద్యాలలో ఎవరో ప్రస్తావించి చెప్పినవి కూడా భార్యాభర్తలకిద్దరికీ వర్తిస్తాయి. ఎందుకంటే సంసారంలో అన్ని విషయాల్లోనూ వీరిద్దరివీ సగపాలు.

మగడు భార్యని అర్థం చేసుకోగలగాలి

సతి మతినెరుగని పతి రవి
శతసమమౌ ద్యుతి కలిగిన శార్వరినందున్
రతిజత యితడికి పితయను
అతివల మదిలో మెదిలిననల్పుడు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
సతి = భార్య
మతి = మనసు, ఆలోచన
రవిశతసమము = వంద సూర్యులతో సమానమైన
ద్యుతి = వెలుగు
శార్వరి = రాత్రి
రతి = మన్మథుని భార్య
జత = భర్త
పిత = తండ్రి
అల్పుడు = తక్కువవాడు, హీనుడు

భావము:
--
కట్టుకున్న భార్య మనసుని అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించని భర్త రాత్రిలో కూడా సూర్యునివలే భాసించేంతటి అందగాడైనా, తను మన్మథుని పుత్రుడా అంటూ ఆశ్చర్యపోయే ఆడువారి మనసులో కోట కట్టుకుని నిలిచినా, వాడు అల్పుడే!

భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. దానికి ఎంతో కొంత భర్త ఎక్కువ దోహదపడాలి (ముందడుగు వేయాలి). ఎందుకు అంటే, తరతరాలుగా భర్తలే (మన దేశంలో) వయస్సు లో పెద్దవారు, మానసిక-పరిపక్వత కలిగే వయస్సు కలిగినవారు. పైగా, ఆడువారు అంతగా మనస్సులో కలిగిన భావాలను బయటికి చెప్పుకోవడానికి అలవాటుపడరు. (ఈ కాలంలో చాలామంది స్త్రీలు ఆ విద్యను కూడా మరిగారు అనుకోండి).

Saturday, September 29, 2007

ఆడువారికి భావావేశాలు ఎక్కువ

జగడము గోరుచు యనినను
తగునుర విన త్రాగుబోతు తర్కపుకూతల్
మగువలు కాంతాళముతో
వెగటుగ పలికిన వినకనె విడువర శాస్త్రీ

కొన్ని పదములకు అర్థములు:
--
జగడము = తగువు
తర్కము = వాదము, గొడవ
కూత = కేక
కాంతాళము = దు:ఖము వలన కలిగిన కోపము
వెగటు = చేదు, కించపరిచెడి

భావము:
--
ఆడువారికి భావావేశాలు ఎక్కువ. వారి హృదయం సున్నితం. అందుకే కొంచెం కష్టం వారికి కలిగినా, వారికి ఇష్టమైనవారికి కలిగినా ఓర్వలేరు. ఆ ఆవేశంలో ఎంత మాటలైనా అంటుంటారు. అలాంటి మాటలను పట్టుకుని వారికి దూరంగా జరుగడం మగవారు చెయ్యవలసిన పని కాదు.

ఉదాహరణగా మన రామాయణం తీసుకుందాం. మారీచుడు "హా లక్ష్మణ, హా సీతా" అన్నప్పుడు - లక్ష్మణుడు ఎంతో నమ్మకంగా "మా అన్నగారికి ఎటువంటి ఆపదా రాదు - ఇది మారీచుని కుట్ర అయ్యి ఉండవచ్చు", అని చెప్తుంటే సీత మాత్రం: "లక్ష్మణ, ఒక తమ్ముడు రాజ్యం అపహరిస్తే మరొక తమ్ముడు అన్నగారి భార్యనే ఆశిస్తున్నాడు. నీ పన్నాగాలు పారవు. నేను ప్రాణత్యాగం చేస్తానేమో కానీ నీకు దక్కను", అంటూ ఎన్నో సూటిపోటి మాటలతో లక్ష్మణున్ని బాధపెట్టి తమ కుటీరంనుండీ పంపించింది. ఆ తరువాతా ఏమి జరిగిందో అందరికీ తెలుసును. వదిన పాదాలను తప్పితే తలెత్తి ఎప్పుడూ చూడని వాడు అని సీతకు తెలియకనే అలాగ ప్రవర్తించలేదు. కేవలం రాముడు ఏ కష్టాలలో ఉన్నాడో అనే కంగారులోనే అలాగ అంది.

Wednesday, September 26, 2007

శాంతం ఆడువారికి అందం

పాములు తిరిగెడి పొదలో
సోముగ నిదురించవచ్చు, శోభస్కరమౌ
సామము తెలియని నలుగురు
భామల నడుమకు చనకుర భద్రము శాస్త్రీ

కొన్ని పదములకు అర్థాలు:
--
సోము = సుఖము
శోభస్కరము = కీర్తిదాయకము
సామము = శాంతము, మంచితనము, సున్నితమైన ప్రవర్తన
చను = వెళ్ళు

భావము:
--
పాములు సంచరించే పొదల్లో కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోవచ్చును (అయ్యో! ఏ పాము కుడుతుందో అనే భయం లేకుండా) ఏమో కానీ, నోరు పారేసుకుంటూనో, కోపం ప్రదర్శిస్తూనో ఉండే ఆడువారి మధ్యన మాత్రం మనం ఉండలేము. ఎందుకంటే వారికి కోపం ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో, ఏం చేస్తారో సామాన్యులకు అర్థం కాదు.

పాము భయం వేసినప్పుడు కానీ కుట్టదు. తగువులమారి ఆడువారు కారణం లేకున్నా గొడవ చేస్తారు.

పాము పొదలో నిదురిస్తే "ఆహా, వీడు పాములకు భయపడడురా" అనే కీర్తి ఐనా వస్తుంది. కుదురు లేని ఆడువారి మధ్యన ఉంటూ వారిని ఏమీ అనకుండా ఉంటే: " వీడు వట్టి దద్దమ్మ" అంటారు. వారిని దండిద్దామని ప్రయత్నిస్తే "ఆడువారి మీదరా వీడి ప్రతాపం" అని అంటారు. ఇంతలో ఈ ఆడువారు అనే నానా మాటలూ వేరే ఉన్నాయనుకోండి.

అన్నిటికన్నా ముఖంగా, ఒక ఆడ పాముకు ఇంకో ఆడ పామంటే కోపం ఉండదు. కానీ ఇద్దరు కోపీష్ఠి ఆడువారి మధ్యన అంత స్నేహం రావడం కష్టమే!

ఇలాంటి గొడవ లేకుండా ఉండాలంటే, అటువంటి స్త్రీలకు దూరంగా ఉండటమే శరణ్యం.

Tuesday, September 25, 2007

ధనవ్యామోహపీడితుణ్ణి నమ్మద్దు

నమ్మదగును వనతములన్
నమ్మదగును త్రాగుబోతు నడవడినైనన్
నమ్మదగును త్రాచు చెలిమి
నమ్మకుమీ కనకలోలుఁ నయముర శాస్త్రీ

కొన్ని పదములకు అర్థములు:
--
వనతములు = మృగములు (వనములో జీవించే జంతువు)
నడవడి = ప్రవర్తన
చెలిమి = స్నేహం
కనకలోలుడు = కనకము,ధనమునందు కోరిక కలవాడు
నయము = మెరుగు,ఉత్తమం

భావము:
--
క్రూరమృగాలను, త్రాగుబోతు మాటలను, త్రాచుపాము అభిమానాన్ని ఐనా నమ్మచ్చు కానీ డబ్బుపై వ్యామోహం ఉన్న వాడిని నమ్మకు. (వాడెప్పుడు మారుతాడో, మాట మారుస్తాడో మనకు తెలియదు.)

Thursday, September 20, 2007

మంచిగా సంపాదించిన డబ్బే మంచి చేస్తుంది

ఙాతుల తిరిపము దినుటయు
నాతులయార్జనము దినుట నయమగు రీతుల్
జీతముకై నిలువకుమీ
నీతికి నిలబడని వాని నీడను శాస్త్రీ

కొన్ని పదములకు అర్థములు:
--
ఙాతులు = తెలిసినవారు, స్నేహితులు
తిరిపము = భిక్షము
నాతి = ఆడుది
ఆర్జనము = సంపాదన
నయము = ఉన్నతమైన

భావము:
--
బంధువుల భిక్ష మీద బ్రతుకవచ్చు, ఆడువారి సంపాదన మీద కూడా బ్రతుకవచ్చు కానీ నీతినియమాలు లేని తుఛ్ఛుల దగ్గర మాత్రం డబ్బు కోసం పని చెయ్యరాదు. ఆ డబ్బు మనకి మంచి చెయ్యదు.

Wednesday, September 19, 2007

ఆడువారిని గౌరవించడం మన సంప్రదాయం

కులకాంతకు కలతకలిగి
కలహముజే యదుకులంబు కలిసెను మట్టిన్
కలనైనను కలిగించకు
కలకంఠికి కంట నీరు కైపున శాస్త్రీ

కొన్ని పదములకు అర్థములు:
--
కులకాంత = గౌరవప్రదమైన స్త్రీ
కలత = బాధ
కలహము = గొడవ, తగువులు
యదుకులంబు = శ్రీ కృష్ణుడి వంశం
కలకంఠి = చిలుకవంటి గొంతు కలది (స్త్రీ)
కైపు = పొగరు, మత్తు, గర్వము

భావము:
--

శ్రీ కృష్ణుడు కౌరవులను, పాండవులను సంధికి తీసుకురాగలిగి కూడా కేవలం వ్యక్తిగతతృప్తి కోసం కౌరవులను, కొందరు పాండవులను కూడ కురుక్షేత్రమనే నెపంతో చంపించాడని పతివ్రతాశిరోమణి ఐన గాంధారి భావిస్తుంది. అందుకే కష్ణుడి వంశం కూడా అంత:కలహాలతో నశించాలని శపిస్తుంది. ఆ శాపం వలనే్ యదువంశం నశిస్తుంది. శ్రీ కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మస్వరూపమైనప్పటికీ పతివ్రత ఐన ఆడదాని ఉసురు తగిలి దేహం చాలించవలసివచ్చింది. అలాంటిది మనమెంత?

ఆడువారతో తగిన కారణం లేకుండా తగువులాడవలదు అని సుమతీ శతకంలో కూడా చెప్పబడింది. ఆ పద్యములోనూ ఆడువారిన
కలకంఠి అనే సంబోధించడం జరిగింది. ఇక్కడ: కలకంఠీ అనే పదం నాకు నచ్చడం, పద్యంలో చక్కగా అమరడం చేతా మరలా వాడవలసివచ్చింది.

Monday, September 17, 2007

జూదము అన్నిటికంటే పెద్ద వ్యసనం

లేశము బడయక పాండవు
లాశలకోడిరి తమసతి లజ్జయు, లిబ్బుల్
దేశము వీడిరి కానలఁ
క్లేశములొందిరి వలదుర కితవము శాస్త్రీ

కొన్ని పదములకర్థములు:
--
లేశము = చాలా తక్కువ, కొంచెం, అణువు
లజ్జ = అభిమానము, సిగ్గు
కాన = అడవి
క్లేశము = బాధలు, కష్టాలు
కితవము = మోసముతో కూడుకున్నది (జూదము)

భావము:
--
ఎంతో బలవంతులయ్యుండి పాండవులే ఆశతో జూదమాడి తమ భార్య మానానికి ప్రమాదం తెచ్చుకున్నారు, వారి ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. వారి స్వదేశముని విడిచి, అడవులలో కష్టాలు అనభవించారు. (ఇంక మనమెంత). జూదము వలదు.

Wednesday, September 12, 2007

కృషితో నాస్తి దుర్భిక్షం

శ్రమకోర్చెడివారలనే
అమితంబౌ జయముజేరు, యశము వరించున్
గమనించుము దమనముతో
ధమనుని ధరియించు యినుని ధగధగ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
యశము = కీర్తి
దమనము = నిగ్రహము
ధమనుడు = అగ్ని
ఇనుడు = సూర్యుడు
ధగధగ = మెరియి

భావము:
--
కష్టపడి పని చేసేవాడినే జయము, కీర్తీ వరిస్తాయి. ఎంతో ఓపికగా మండే అగ్నిని తనపై మోస్తున్న సూర్యుడు ఎంత శోభిస్తున్నాడో చూస్తున్నాము కదా!

మాటకారికెప్పుడూ మంచిరోజులే

ఎక్కువ మాటలు వాడక
మక్కువ కలిగెడి విధమున మదిరంజింపన్
గ్రక్కున నీ మనముఁదెలుపు
దక్కును మర్యాదనీకు ధరణిన్ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
గ్రక్కున = త్వరగ

తనవారు తన్నాకే సత్పురుషుడు తింటాడు

తనవారల కడుపుఁగనక
తినుచుండెడివాని కన్న తిరిపరి మెరుగౌ
సునకమునకు పర్యుషితము
కనినంతన వేరు తలపు కలుగదు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
కను = చూడు
తిరిపరి = భిక్షాటన చేసుకునెడి వాడు
సునకము = కుక్క
పర్యుషితము = పాడైపోయిన, పాచి అన్నము

భావము:
--
బుద్ధిమంతుడు తన కుటుంబము సంతృప్తిగా ఉన్నప్పుడే తన సుఖము చూసుకుంటాడు. వారికి లేని సుఖమునకై ఎగపడడు. అలాగ కాక, తనవాళ్ళు బాగున్నారో లేదో చూడకుండా తన సుఖము చూసుకునేవాని కన్న భిక్షాటన చేసుకునేవాడు అధికుడు.

ఇక్కడ కుక్కకీ అటువంటి లోభికీ పోలిక చెప్పాబడింది. కుక్క ఎటువంటి అన్నం కనబడినా ఎగబడి, తనవాళ్ళ గురించి చింత లేకుండా తింటుంది. లోభి కుక్కవంటివాడు - మరియూ అతను తినెడి సొమ్ము పాడైన కూడు వంటిది.

ఆడువారికి వేదాంతం మప్పటం కష్టం

భగభగ మండెడి నిప్పుకు
తగులిన యింధనమువోలె తాపాగ్నులజే
రగిలెడి రమణికి చెప్పిన
నిగమాంతములున్ తగులడు నిక్కము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
తాపాగ్నులు = తాపత్రయాలు (ఆధ్యాత్మిక, అధిభౌతికము, అధిదైవికము ఐన కష్టాలు, చింతలు)
రగులు = రాజుకొను, మండు
నిగమాంతములు = వేదాంతములు
నిక్కము = నిజము

భావము:
--
కోపం/ఆవేశం/దుఃఖంలో ఉన్న స్త్రీకి మనం చెప్పే వేదాంతధోరణి నచ్చదు.

ఆడువారికి వేదాంతములు, వైరాగ్యధోరణీ అలవడటం కష్టం. అందుకే మగజన్మని కొంత ఉన్నతంగా కొన్ని పురాణాలలో చెప్పారు.

ఐతే దీనికి స్త్రీలు కోపం పడవలసింది లేదు. ఎందుకంటే తమనుండి మరొకరికి జన్మనిచ్చే అదృష్టం భగవంతుడు స్త్రీలకే ఇచ్చాడు. అందుచేతనే వారికి పేగు బంధం మగవారి కంటే ఎక్కువ. వారికి భౌతికమైన బంధాలు ఇంకా బలీయమైనవి. మన పురాణాల్లో అందుకే భర్త చేసిన ప్రతీ తపస్సు వంటి సత్కార్యాలలో భార్యకూ సగం పుణ్యం లభిస్తుంది అని చెప్పారు.

ఈ పద్యము ఎవరికైనా కోపం కలిగించి ఉంటే మన్నించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇది కేవలం నా అనుభవం.

సహనం స్త్రీలకే సాధ్యం, అలంకారం

వహియించుట ధరభారము
దహియించెడియగ్గిఁజేతఁదాల్చుట సులువౌ
సహనము కరువైన నెలత
సహవాసము జేయఁగాదు సాధ్యము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
వహియించు = మోయు, భరించు
సహవాసము = కలిసి జీవించు
నెలత = స్త్రీ

భావము:
--
సహించే శక్తి ఆడువారికి ఇచ్చాడు భగవంతుడు. అది వారికి అలంకారం. భూమియొక్క భారాన్ని మోయుట, అగ్గిని చేత పట్టుట సాధ్యమేమో కానీ, సహనం లేకుండా (మగనిపై) విరుచుకు పడుతూ, కించపరుస్తూ ఉండే స్త్రీతో సహవాసం చెయ్యడం కష్టం.

Sunday, September 2, 2007

మాటలు చెప్పడం సులువు

కోటలు గట్టొచ్చు, సిరుల
తోటలు పండించవచ్చు, దొనరగ దివిలో
బాటలు వేయొచ్చు, బలిమి
మాటలఁజెప్పుట సులభము మనిషికి శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
దొనరగ = ఒప్పే విధంగ
బలిమి = గొప్ప

భావము:
--
ఆకాశంలో దారులు వేస్తాను, కోటలు కట్టేస్తానని, డబ్బు సంపాదిస్తాననిమొదలైన మాటలు చెప్పుట ఎవరికైనా సులభమే! (అవి సాధించడం కష్టం).

అత్త-కోడలు, మామ-అల్లుడు

శతమాన్యుని యెదుటనసుర

పతికీర్తన జేయచెల్లు, పామరము సుమీ

సతిచెంత తల్లి పెరిమియు

పతిముందర తండ్రి ఘనత పలుకుట శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:

--

శతమాన్యుడు = ఇంద్రుడు

అసురపతి = రాక్షసుల రాజు

పామరము = అఙానం

పెరిమి = గొప్పదనం


భావము:

--

ఇంద్రుడి ముందు రాక్షసులరాజును పొగడవచ్చునేమో (వారు సవతిబిడ్డలు కాబట్టి సహజవైరం కలదు). కానీ భార్యముందు తల్లినీ, భర్త ముందు తండ్రినీ పొగుడుట మాత్రము అఙానమే ఔతుంది.

పొగుడుతుంటే కలిగే తృప్తి అనిర్వచనీయం

కీరము తీయగ పలికిన
ధారాతము కూసిననతి ధారాళముగన్
నారదగానము సాగిన
మీరదు మాధుర్యమందు మెప్పును శాస్త్రీ


కొన్ని పదాలకు అర్థాలు:
--
కీరము = చిలుక
ధారాతము = కోకిల
ధారాళముగ = అడ్డులేకుండా
మీరు = దాటు, అధిగమించు

భావము:
--
చిలుక పలికినా, కోకిల స్వతంత్రంగా కూసినా, నారదుడేగానము చేసినా, అవేవీ మనని ఎవరైనా పొగిడితే తోచేంత మధురముగా తోచవు. పొగడ్తే అన్నిటికంటే తీయని పలుకు.

తక్కువగా మాట్లాడటం ఉత్తమం

పాకంబున లవణమువలె
స్తోకంబుగ పలికినంత దొరయనడుగుచున్
కైకొందురు, హెచ్చినచో
యేకంబుగనుమ్మిపోదురెల్లరు శాస్త్రీ


కొన్ని పదాలకు అర్థాలు:
--
పాకము = వంటకం
లవణము = ఉప్పు
స్తోకంబు = తక్కువ
దొరయగ = తగినట్టుగ
కైకొను = తీసుకోను
హెచ్చు = ఎక్కువ అగు

భావము:
--
కూరలో ఉప్పు తక్కువైతే తగినంత అడిగి కలుపుకుంటారు. అదే ఎక్కువైతే నోట్లో వేసుకున్నది ఉమ్మిఫోతారు. మరింక ఉప్పు తగ్గించలేము. అలాగే మాట్లాడటం కూడా. తక్కువగా మాట్లాడితే కావలసిన విషయం అడిగి తెలుసుకుంటారు. అదే మనం ఎక్కువగా మాట్లాడితే మాటలు వెనక్కి తీసుకునే మార్గం లేదు. అందరి దృష్టిలోనూ మూర్ఖులమౌతాము.

కుళ్ళు లేని కోమలి, మోసం చెయ్యని మగవాడు

ఇరుగుపురుగు గృహములలో
సిరులఁగనియు యేడ్వకుండు చేడియ గుణమున్
పరధనమునకాశపడని
పురుషుని ఘనతయు తగునుర పొగడగ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
చేడియ = స్త్రీ

భావము:
--
పరులు ఉన్నతిని చూసి బాధపడక ఉన్నదానితో సంతృప్తి చెందే ఆడుది, పరుల ధనానికి ఆశపడక స్వయంకృషితో బ్రతికే మగవాడు పొగడదగినవారు.

ఆత్మగౌరవం అన్నిటి కంటే ముఖ్యమైన సంపద

పొట్టియకాటులనోర్చుచు
పట్టెపు పోటులఁ భరింప బహుసులభంబౌ
తిట్టిననోపగజాలము
చుట్టములే తప్పు లేక, చూడక శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
పొట్టియ = తేలు
పట్టెము = పెద్ద కత్తి

భావము:
--
తేలు కుట్టిన నొప్పి పైన ఎవరైనా కత్తితో హింసించినా భరించవచ్చునేమో కానీ, (ప్రియమైన) బంధువు మన తప్పు లేకుండా, తప్పొప్పులు తెలుసుకూకుండా నిందిస్తే భరించలేము.

మహర్షులను సైతం మోసం చేసేది

రతిఁగోరుచు దరిఁజేరిన
సతినాపగఁజాలలేదు సాయంత్రమునన్
యతివరుడైనను కామము
మతిపోగొట్టును మదనుని మాయర శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
యతివరుడు = మునులలో శ్రేష్ఠుడు
మదనుడు = మన్మథుడు

భావము:
--
కశ్యపుడు గొప్ప ముని. ఆయన భార్య ఐన దితి అసురసంధ్యవేళలో కూడుటకు చేరగా వారించలేకపోయాడు ఆ ముని. అంతటి ఙానిని కూడా అశక్తుడిగ చేసేది కామము. అందుకే ఎల్లపుడు వివేకులై, సావధానులై ఉండాలి బ్రహ్మచారులు.

విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

గురువును మన్నన సేయుట
ఎరుగుదునను యెగపు విడిచి యేకాగ్రతతో
విరివిగ సాధన సలుపుట
నిరతియు ఛాత్రులకు వలయు, నియమము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ఎగపు = పొగరు
నిరతి = కుతూహలము, నేర్చుకోవాలనే కోరిక
ఛాత్రుడు = విద్యార్థి

భావము:
--
గురువును గౌరవించడం, అన్నీ తెలుసును అనే పొగరు మాని నిరంతరమూ సాధన చెయ్యడం, తెలుసుకోవాలనే కుతూహలము మంచి విద్యార్థికి కావలసిన లక్షణములు.

భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడికి ఈ లక్షణాలు ఉన్నందునే గీతని బోధించనున్నాను అని చెప్పాడు.

Saturday, September 1, 2007

ఒకరిని సరిగ్గా విమర్శించగల శక్తి వారికే ఉంది

ఇరువురు నీ తప్పొప్పులు
ఎరుగుదురీ విశ్వమందు నెన్నగనెపుడున్
చొరనీయవాత్మబల్కులు
పరమాత్ముడు నీదుతోడ బలుకడు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ఎన్నగ = పరిశీలించగ
చొరనీయు = వినబడనీయు

భావము:
--
ఈ సృష్టిలో ఇద్దరికే నీ తప్పొప్పులు తెలుస్తాయి - ఆత్మ, పరమాత్మ. ఆత్మతో నువ్వు మాట్లాడవు, దాని మాట వినవు. పరమాత్ముడు నీతో మాట్లాడడు. ఈ విధంగా ఉంటే, ఎప్పటికీ నిన్ను నువ్వు పరిశీలించుకోలేవు. అందుకే ఆత్మనీ, పరమాత్మనీ అర్థం చేసుకోవాలి.

అరిషడ్వర్గము జయించుట నిజమైన ఘనత

కరిశతసమబలుడైనను
దరిజేరిననప్సరసలు దరహాసముతో
సిరియింటనె కొలువున్నను
అరిషడ్వర్గమును విడకనల్పుడు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
కరిశతసమబలుడు = వంద ఏనుగుల బలం కలవాడు
సిరి = లక్ష్మీ దేవి
అరిషడ్వర్గము = కామక్రోధలోభమోహమదమాత్సర్యములు - అనెడి ఆవేశములు
అల్పుడు = తక్కువ వాడు

భావము:
--
డబ్బు, కండబలం, కాంతాసాంగత్యము సాధించినవాడైనా వాడిని వాడు జయించకపోతే అల్పుడే అవుతాడు.

Friday, August 31, 2007

ధర్మం అన్నిటికంటే గొప్పది

ధర్మంబొనరగనొసగెడి
శర్మంబత్యల్పమైన శాస్వతమౌనీ
మర్మంబెరుగని మానవ
కర్మంబత్యల్పమౌను కనుగొన శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ధర్మం = నీతి
ఒనరగ = తగురీతిలో, రాజసంగ
శర్మం = ఆనందం, సుఖం
మర్మం = ముఖ్యమైన విషయం
కర్మం = పనులు
అల్పము = చిన్నది, నీచమైనది (నానార్థాలు)

పొగడ్తను మించిన కానుక ఉండదు

దానవపాలుని గుణముల
గానము గావించె హరియె ఘనముగ వటుడై
దానము దాత యశోరస
పానముజే సులభమగును పాత్రు(కు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
దానవపాలుడు = రాక్షసరాజు (బలి చక్రవర్తి)
వటుడు = బ్రహ్మచారి
యశోరసపానము = పొగుడుట
పాత్రుడు = అర్హుడు

Monday, August 6, 2007

ధృతరాష్ట్ర ప్రేమ

గొప్పగ నిను పొగుడుచు నీ
తప్పెరిగియుజెప్పకుండ దాచెడి బంధుల్
గప్పుటచే వచ్చెడియా
ముప్పును గమనించలేని మూర్ఖులు శాస్త్రీ

పరదూషణ - అన్నిటికంటే సులువైన పని

హరనామము జపియించుచు
పరులను దూషించువాడు పశుపతి గుణముల్
పరికించక, జీవులలో
పరమాత్మను కాంచలేని పశువుర శాస్త్రీ

కొన్ని పదలకు అర్థాలు:
--
పశుపతి = శివుడు
పరికించు = పరిశీలించు, గమనించు, అర్థము చేసుకొనుటకు ప్రయత్నించు
కాంచు = చూచు

భావము:
--
మనిషికి జంతువుకు తేడా పరమాత్మను గురించిన తెలుసుకోగల శక్తి. పరమాత్ముడు ఈ విశ్వమంతా ఉన్నాడు. ఈ విషయాన్ని మరిచి పరులలో తప్పులను వెదకుచూ కామక్రోధలోభమోహమదమాత్సర్యాలకు లోనై ఉండే వారికీ పశువులకీ పెద్ద తేడా లేదు.

ధనమదాంధుడు నపుంశకుడు

మేదిని యే వొక్కరి సిరి
కాదని తానెరుగలేక కాసులమురిజే
పేదల జూడక తన-పర
భేదము విడలేని లోభి పేడిర శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
మేదిని = భూమి
మురి = గర్వము
జూచు = గౌరవించు
తన-పర-భేదము = లోభము
పేడి = నపుంశకుడు

భావము:
--
ఈ పంచభూతాలలో దేనినీ మనలో ఏ ఒక్కరూ సృష్టించలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొందరు వారికి పారంపర్యంగానో, స్వార్జితంగానో, దుర్మార్గాలతోనో వచ్చిన సొమ్ము చూసి మదించి - పేదలను చిన్నచూపు చూడటం, వారికి సాయం చెయ్యకపోవడం వంటి లోభాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.

పురుషుడు అనే శబ్దానికి అర్థాలలో ఆత్మ అనేది ఒకటి. అంటే అది భౌతికభావాలకు అతీతమైనది. కానీ లోభులు హీనమైన ధనవాంఛతో పుంసత్వానికి దూరం అవుతారు.

స్నేహం ఒక మానసిక వైద్యం

అరుణుని కిరణాలు దగిలి
కొరనెల తెరలాడు నిశిని కొరతను మరువన్
సరసుని సెరబడి జేతను
కరుగును మనసున నెరకొను కన్నర శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
అరుణుడు = సూర్యుడు
కొరనెల = అర్థచంద్రుడు
తెరలాడు = (ఇక్కడ, చీకటి అనెడి) తెరలో ప్రకాశించు
నిశిని = రాత్రి/చీకటిలో
కొరతను = (వెలుగుయొక్క) లేమిని
సరసుడు = మంచి, చెడు తెలిసిన వ్యక్తి
సెరబడి = స్నేహం
నెరకొను = నిండు
కన్నర = దు:ఖము

మోహము పుట్టే సమయం చెప్పగలమా?

ధరకంపించెడి గడియను
సరగున గుణియింపదగును శాస్త్రము జేతన్
మరులు మదిని గొనెడి గడియ
నెరుగగతరమే త్రికాలవిదుకున్ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ధర కంపించు = భూకంపం వచ్చు
సరగున = త్వరగా
గుణియించు = లెక్కించు
శాస్త్రము = విఙానము
మరులు = మోహము
త్రికాలవిదుడు = భూత,భవిష్యత్,వర్తమానకాలములు తెలిసినవాడు

Friday, July 27, 2007

సోమరిపోతు కవి

వారము, వర్జ్యము, పనిలో
భారము, భావాల లేమి, భార్యాబిడ్డల్
నేరము వీరలదేనని
కోరికవిత నుడువనికవి కుంథుడు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
కుంథుడు = సోమరి

(ఈ పద్యానికి స్ఫూర్తి నేనే!)

Saturday, June 30, 2007

విషయం తెలియకుండా వనితకు వాగ్దానం

సతి గోర్కెకు ధరణీపతి
సుతరత్నమునడవికంపె, సురధుని సుతులన్
పతిబాసకు నీటవిడిచె
మతినెరుగక మాటలీకు మగువకు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ధరణీపతి = మహారాజు (దశరథుడు)
సుతరత్నము = సుతులలోకెల్ల రత్నము వంటివాడు (రాముడు)
సురధుని = సురప్రవాహం (గంగ)
పతిబాస = పతియొక్క వాగ్దానం
మతి = అంతరంగం

Wednesday, June 27, 2007

పిల్లల్ని పెంచటం ఒక యఙం

లవలేశమె కలుగును కొల
శివలింగము దెచ్చిపూజ సేయని వటుకున్
చవిచూతురు నరకమునిలఁ
వివరించక మంచిచెడుల బిడ్డకు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
లవలేశము = చాలా తక్కువ
కొల = పాపమునకు శిక్ష
వటుడు = బ్రహ్మచారి
చవిచూచు = రుచిచూచు

అడుగకనే ఉపాయము

అడుగనివానికుపాయము
వెడయగు మన్నన బొరయక వెతలను తెచ్చున్
చెడిపోయినదందురొరులు
గొడగొనకనె పెట్ట తిండి గోముగ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ఉపాయము = సలహా
వెడయగు = వృథా అవుట
మన్నన = మర్యాద
బొరయు = పొందు
వెతలు = కష్టాలు
ఒరులు = అన్యులు
గొడగొను = ఆకలివేయు
గోముగ = మిక్కిలి గారంగా

ఆసక్తిలేని వారికి విద్యని మప్పుట

కలగక మనమున గోరిక
విలువగు విద్యలఁ కరచిన విటబోవుటకౌ
వెలుగని పుల్లలలోపడి
వలచగ సాంబ్రాణికెట్లు వచ్చును శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
మనము = మనస్సు
కరచు = మప్పు, నేర్పించు
విటబోవుట = వృథా అవుట

Tuesday, June 26, 2007

సహనము నశిస్తే

సహనము కలవాని కినుకు
దహనము గావించునొరుల ధమనుని రీతిన్
సహతానోరిమి గలదియు
నిహనన నెరపదె యదరిన నిమషము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
కినుక = కోపము
ఒరులు = అన్యులు
ధమనుడు = క్రూరుడు/అగ్ని
సహ = భూమి
ఓరిమి = ఓర్పు
నిహనన = వినాశనం
నెరపు = చేయు
అదరు = కంపించు

యవ్వనం

ఖరవరుగూతలె గానము
కొరనెల యడరించు కిరణకుసుమశరంబుల్
తరుచరురూపమె యందము
తరుణిమ జూపును మహిమలు దండిగ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ఖరవరుడు = గాడిదలలో ఉత్తముడు
కొరనెల = కొంచెమే కనిపిస్తున్న చంద్రుడు
కుసుమశరంబుల్ = మన్మథబాణాలు
తరుచరుడు = చెట్లపై చరించేవాడు - కోతి
తరుణిమ = యవ్వనం

సంతోషం - ఆకాశం

ఏదను వారలకుండదు
మాదనుకొనువారికెల్ల మహిపైనుండున్
రోదసి మాదిరి జూడగ
మోదమునకు మదినియూహ మూలము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
మహి = నేల, భూమి
రోదసి = ఆకాశం, అంతరిక్షం
మోదము = ఆనందము
ఊహ = ఆలోచన, తలపు

Friday, June 22, 2007

సుఖదుఃఖములు

మరిగినపుడు చదలకెగసి
కరిగినపుడు కడలిని పడు గంగ విధమునన్
తరుగక మదికింగోరిక
తిరుగును సుఖదుఃఖములను తిరికలఁ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
చదలు = ఆకాశం
తిరిక = మెలిక

ఆత్మ, పరమాత్మ

ఇరువురు నీ తప్పొప్పుల
నెరుగుదురీ విశ్వమందు నెన్నగనెపుడున్
చొరనియ్యవెయాత్మపలుకు
పరమాత్ముడు నీదుతోడ పలుకడు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
చొరనియ్యు = వినిపించుకొను
నీదుతోడ = నీతోటి

ముక్తి

నానా విషయాసక్తులుఁ
నా,నాకను భావమెల్ల నశియించు తరిన్
నానాటికినక్కరుడుగు
నానాటికి ముక్తి గల్గునార్యుకు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
నానా = బహువిధాల
అక్కర = అవసరం/కోరిక

Thursday, June 21, 2007

యోగి

భోగులు సుఖమాశింతురు
జోగులు విడుదురు సుఖమును చుచ్చున్ మాయా
రోగులు రోదింతురెపుడు
యోగుల మదిఁరాదు భావయుగళము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:

యోగి - ఫలితము మీద ఆశ లేకుండా పని చేసెడివాడు
జోగి - సన్యాసి, భవబంధాలను విడిచిపెట్టినవాడు
భావయుగళం - మంచి, చెడు అనెడి రెండు విధములైన భావములు

శ్రీరామ

నమస్కారం,

నాకు శాస్త్రీ అనే పేరు చాలా ఇష్టం. కందపద్యాలన్నా ఇష్టం. అందుకే నాకు అప్పుడప్పుడూ అనిపించిన విషయాలను ఈ శాస్త్రీ శతకంగా వ్రాయాలని అనిపించింది.

మరి ఏదో పుస్తకంలో వ్రాసుకోకుండా ఎందుకు blog చేస్తున్నారు అని అంటారా, పుస్తకాలు ఎక్కడకెళ్ళినా మోసుకెళ్ళే అవకాశం ఉండదు. పైగా మీ లాంటివాళ్ళ అభిప్రాయం తెలుసుకునే అవకాశమూ ఉండదు.