Monday, November 26, 2007

మాటలాడే పద్ధతి

తిరముగ తెలిసిన విషయము
నెరవుగ జెప్పుట తగునని నీవెరిగినచో
ఇరువురి సౌఖ్యము గోరుచు
పరులను బాధింపకుండ పల్కుము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
తిరముగ = స్థిరముగ
నెరవుగ = నిశ్చయంగ
ఇరువురి = చెప్పెడివాని, వినెడివాని
సౌఖ్యము = సంతోషము, మంచి

భావము:
--

మనం చెప్పబోయే విషయం నిజమని, అది అవసరం అని తెలిస్తే - అప్పుడు మన మంచితో పాటూ, వినెడి వారి మంచిని కోరుతూ - ఇతరులను బాధింపకుండా చెప్పదగును.

ఏదైనా విషయం ప్రస్తావించేటప్పుడు నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి :
౧. ఇది నిజమా?
౨. ఇది చెప్పడం అవసరమా?
౩. ఇది వినేవాడికేమైనా ఉపయోగం ఉందా? లేక, నాకు ఏమైనా ఉపయోగం ఉందా?
౪. ఇది నేను చెప్పుటజేత వేరొకరు బాధపడరు కద?

ఈ ప్రశ్నలు నిశ్చయంగా మన మాటల వలన ఏ అనర్థాలను రాకుండా చూస్తాయి.

అసలు మనిషికి ఉన్న శత్రువులు ఇంద్రియాలు. వీటి వలనే మనం కర్మలను ఆచరిస్తాము. వాటి ఫలితాలను అనుభవిస్తాము. వీటిలో మనసు, నోరు అన్నిటికన్న గొప్ప శత్రువులు. వీటిని గనుక మనం అదుపులో పెట్టుకుంటే సగానికి పైగా ప్రపంచాన్ని జయించినాట్టే!


నిజానికి నేను ఈ పద్యము వ్రాసి చాలా రోజులయినా ఇక్కడ ప్రస్తావించకపోవడానికి ఒక కారణం ఉంది. నేను స్వయంగా అన్ని సందర్భాలలోనూ ఆచరించని విషయం వ్రాయడంలో అర్థం లేదు. అందుకు. ఎప్పటికప్పుడు "అయ్యో! ఆ మాట అనవసరంగా అన్నానే", అనుకుంటూనే ఉంటాను.

అయినా, జీవితంలో తనకు తాను నచ్చాలంటే యోగి అయ్యి ఉండాలి (కర్మ యోగి, భక్తి యోగి, ధ్యాన యోగి మొ) - లేక మూర్ఖుడైనా అయ్యి ఉండాలి. రెండవది తెలుసుకోవడం అనుకున్నంత సులువు కాదు. ముందుది సాధించడం చెప్పినంత సులువు కాదు. అందుకే చాలా మంది మంచివారు, తమలో తమకు నచ్చని గుణాలకు బాధపడుతుంటారు. నేను మంచివాడినో కానో తెలియదు కానీ - మంచివానిగా ఉండాలి అనుకుంటున్నాను - నాకు నేను పూర్తిగా నచ్చను. ఇక ఇదంతా ఎందుకు చెబుతున్నాను - అంటే నేను పూర్తిగా ఆచరించని విషయం - ఇతరులకు చెబితే పూర్తిగా ఆచరించగలగవచ్చు. అందుకే నేను నేర్చుకున్న విషయాలను ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ వ్రాస్తున్నాను.

No comments: