Saturday, September 29, 2007

ఆడువారికి భావావేశాలు ఎక్కువ

జగడము గోరుచు యనినను
తగునుర విన త్రాగుబోతు తర్కపుకూతల్
మగువలు కాంతాళముతో
వెగటుగ పలికిన వినకనె విడువర శాస్త్రీ

కొన్ని పదములకు అర్థములు:
--
జగడము = తగువు
తర్కము = వాదము, గొడవ
కూత = కేక
కాంతాళము = దు:ఖము వలన కలిగిన కోపము
వెగటు = చేదు, కించపరిచెడి

భావము:
--
ఆడువారికి భావావేశాలు ఎక్కువ. వారి హృదయం సున్నితం. అందుకే కొంచెం కష్టం వారికి కలిగినా, వారికి ఇష్టమైనవారికి కలిగినా ఓర్వలేరు. ఆ ఆవేశంలో ఎంత మాటలైనా అంటుంటారు. అలాంటి మాటలను పట్టుకుని వారికి దూరంగా జరుగడం మగవారు చెయ్యవలసిన పని కాదు.

ఉదాహరణగా మన రామాయణం తీసుకుందాం. మారీచుడు "హా లక్ష్మణ, హా సీతా" అన్నప్పుడు - లక్ష్మణుడు ఎంతో నమ్మకంగా "మా అన్నగారికి ఎటువంటి ఆపదా రాదు - ఇది మారీచుని కుట్ర అయ్యి ఉండవచ్చు", అని చెప్తుంటే సీత మాత్రం: "లక్ష్మణ, ఒక తమ్ముడు రాజ్యం అపహరిస్తే మరొక తమ్ముడు అన్నగారి భార్యనే ఆశిస్తున్నాడు. నీ పన్నాగాలు పారవు. నేను ప్రాణత్యాగం చేస్తానేమో కానీ నీకు దక్కను", అంటూ ఎన్నో సూటిపోటి మాటలతో లక్ష్మణున్ని బాధపెట్టి తమ కుటీరంనుండీ పంపించింది. ఆ తరువాతా ఏమి జరిగిందో అందరికీ తెలుసును. వదిన పాదాలను తప్పితే తలెత్తి ఎప్పుడూ చూడని వాడు అని సీతకు తెలియకనే అలాగ ప్రవర్తించలేదు. కేవలం రాముడు ఏ కష్టాలలో ఉన్నాడో అనే కంగారులోనే అలాగ అంది.

Wednesday, September 26, 2007

శాంతం ఆడువారికి అందం

పాములు తిరిగెడి పొదలో
సోముగ నిదురించవచ్చు, శోభస్కరమౌ
సామము తెలియని నలుగురు
భామల నడుమకు చనకుర భద్రము శాస్త్రీ

కొన్ని పదములకు అర్థాలు:
--
సోము = సుఖము
శోభస్కరము = కీర్తిదాయకము
సామము = శాంతము, మంచితనము, సున్నితమైన ప్రవర్తన
చను = వెళ్ళు

భావము:
--
పాములు సంచరించే పొదల్లో కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోవచ్చును (అయ్యో! ఏ పాము కుడుతుందో అనే భయం లేకుండా) ఏమో కానీ, నోరు పారేసుకుంటూనో, కోపం ప్రదర్శిస్తూనో ఉండే ఆడువారి మధ్యన మాత్రం మనం ఉండలేము. ఎందుకంటే వారికి కోపం ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో, ఏం చేస్తారో సామాన్యులకు అర్థం కాదు.

పాము భయం వేసినప్పుడు కానీ కుట్టదు. తగువులమారి ఆడువారు కారణం లేకున్నా గొడవ చేస్తారు.

పాము పొదలో నిదురిస్తే "ఆహా, వీడు పాములకు భయపడడురా" అనే కీర్తి ఐనా వస్తుంది. కుదురు లేని ఆడువారి మధ్యన ఉంటూ వారిని ఏమీ అనకుండా ఉంటే: " వీడు వట్టి దద్దమ్మ" అంటారు. వారిని దండిద్దామని ప్రయత్నిస్తే "ఆడువారి మీదరా వీడి ప్రతాపం" అని అంటారు. ఇంతలో ఈ ఆడువారు అనే నానా మాటలూ వేరే ఉన్నాయనుకోండి.

అన్నిటికన్నా ముఖంగా, ఒక ఆడ పాముకు ఇంకో ఆడ పామంటే కోపం ఉండదు. కానీ ఇద్దరు కోపీష్ఠి ఆడువారి మధ్యన అంత స్నేహం రావడం కష్టమే!

ఇలాంటి గొడవ లేకుండా ఉండాలంటే, అటువంటి స్త్రీలకు దూరంగా ఉండటమే శరణ్యం.

Tuesday, September 25, 2007

ధనవ్యామోహపీడితుణ్ణి నమ్మద్దు

నమ్మదగును వనతములన్
నమ్మదగును త్రాగుబోతు నడవడినైనన్
నమ్మదగును త్రాచు చెలిమి
నమ్మకుమీ కనకలోలుఁ నయముర శాస్త్రీ

కొన్ని పదములకు అర్థములు:
--
వనతములు = మృగములు (వనములో జీవించే జంతువు)
నడవడి = ప్రవర్తన
చెలిమి = స్నేహం
కనకలోలుడు = కనకము,ధనమునందు కోరిక కలవాడు
నయము = మెరుగు,ఉత్తమం

భావము:
--
క్రూరమృగాలను, త్రాగుబోతు మాటలను, త్రాచుపాము అభిమానాన్ని ఐనా నమ్మచ్చు కానీ డబ్బుపై వ్యామోహం ఉన్న వాడిని నమ్మకు. (వాడెప్పుడు మారుతాడో, మాట మారుస్తాడో మనకు తెలియదు.)

Thursday, September 20, 2007

మంచిగా సంపాదించిన డబ్బే మంచి చేస్తుంది

ఙాతుల తిరిపము దినుటయు
నాతులయార్జనము దినుట నయమగు రీతుల్
జీతముకై నిలువకుమీ
నీతికి నిలబడని వాని నీడను శాస్త్రీ

కొన్ని పదములకు అర్థములు:
--
ఙాతులు = తెలిసినవారు, స్నేహితులు
తిరిపము = భిక్షము
నాతి = ఆడుది
ఆర్జనము = సంపాదన
నయము = ఉన్నతమైన

భావము:
--
బంధువుల భిక్ష మీద బ్రతుకవచ్చు, ఆడువారి సంపాదన మీద కూడా బ్రతుకవచ్చు కానీ నీతినియమాలు లేని తుఛ్ఛుల దగ్గర మాత్రం డబ్బు కోసం పని చెయ్యరాదు. ఆ డబ్బు మనకి మంచి చెయ్యదు.

Wednesday, September 19, 2007

ఆడువారిని గౌరవించడం మన సంప్రదాయం

కులకాంతకు కలతకలిగి
కలహముజే యదుకులంబు కలిసెను మట్టిన్
కలనైనను కలిగించకు
కలకంఠికి కంట నీరు కైపున శాస్త్రీ

కొన్ని పదములకు అర్థములు:
--
కులకాంత = గౌరవప్రదమైన స్త్రీ
కలత = బాధ
కలహము = గొడవ, తగువులు
యదుకులంబు = శ్రీ కృష్ణుడి వంశం
కలకంఠి = చిలుకవంటి గొంతు కలది (స్త్రీ)
కైపు = పొగరు, మత్తు, గర్వము

భావము:
--

శ్రీ కృష్ణుడు కౌరవులను, పాండవులను సంధికి తీసుకురాగలిగి కూడా కేవలం వ్యక్తిగతతృప్తి కోసం కౌరవులను, కొందరు పాండవులను కూడ కురుక్షేత్రమనే నెపంతో చంపించాడని పతివ్రతాశిరోమణి ఐన గాంధారి భావిస్తుంది. అందుకే కష్ణుడి వంశం కూడా అంత:కలహాలతో నశించాలని శపిస్తుంది. ఆ శాపం వలనే్ యదువంశం నశిస్తుంది. శ్రీ కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మస్వరూపమైనప్పటికీ పతివ్రత ఐన ఆడదాని ఉసురు తగిలి దేహం చాలించవలసివచ్చింది. అలాంటిది మనమెంత?

ఆడువారతో తగిన కారణం లేకుండా తగువులాడవలదు అని సుమతీ శతకంలో కూడా చెప్పబడింది. ఆ పద్యములోనూ ఆడువారిన
కలకంఠి అనే సంబోధించడం జరిగింది. ఇక్కడ: కలకంఠీ అనే పదం నాకు నచ్చడం, పద్యంలో చక్కగా అమరడం చేతా మరలా వాడవలసివచ్చింది.

Monday, September 17, 2007

జూదము అన్నిటికంటే పెద్ద వ్యసనం

లేశము బడయక పాండవు
లాశలకోడిరి తమసతి లజ్జయు, లిబ్బుల్
దేశము వీడిరి కానలఁ
క్లేశములొందిరి వలదుర కితవము శాస్త్రీ

కొన్ని పదములకర్థములు:
--
లేశము = చాలా తక్కువ, కొంచెం, అణువు
లజ్జ = అభిమానము, సిగ్గు
కాన = అడవి
క్లేశము = బాధలు, కష్టాలు
కితవము = మోసముతో కూడుకున్నది (జూదము)

భావము:
--
ఎంతో బలవంతులయ్యుండి పాండవులే ఆశతో జూదమాడి తమ భార్య మానానికి ప్రమాదం తెచ్చుకున్నారు, వారి ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. వారి స్వదేశముని విడిచి, అడవులలో కష్టాలు అనభవించారు. (ఇంక మనమెంత). జూదము వలదు.

Wednesday, September 12, 2007

కృషితో నాస్తి దుర్భిక్షం

శ్రమకోర్చెడివారలనే
అమితంబౌ జయముజేరు, యశము వరించున్
గమనించుము దమనముతో
ధమనుని ధరియించు యినుని ధగధగ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
యశము = కీర్తి
దమనము = నిగ్రహము
ధమనుడు = అగ్ని
ఇనుడు = సూర్యుడు
ధగధగ = మెరియి

భావము:
--
కష్టపడి పని చేసేవాడినే జయము, కీర్తీ వరిస్తాయి. ఎంతో ఓపికగా మండే అగ్నిని తనపై మోస్తున్న సూర్యుడు ఎంత శోభిస్తున్నాడో చూస్తున్నాము కదా!

మాటకారికెప్పుడూ మంచిరోజులే

ఎక్కువ మాటలు వాడక
మక్కువ కలిగెడి విధమున మదిరంజింపన్
గ్రక్కున నీ మనముఁదెలుపు
దక్కును మర్యాదనీకు ధరణిన్ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
గ్రక్కున = త్వరగ

తనవారు తన్నాకే సత్పురుషుడు తింటాడు

తనవారల కడుపుఁగనక
తినుచుండెడివాని కన్న తిరిపరి మెరుగౌ
సునకమునకు పర్యుషితము
కనినంతన వేరు తలపు కలుగదు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
కను = చూడు
తిరిపరి = భిక్షాటన చేసుకునెడి వాడు
సునకము = కుక్క
పర్యుషితము = పాడైపోయిన, పాచి అన్నము

భావము:
--
బుద్ధిమంతుడు తన కుటుంబము సంతృప్తిగా ఉన్నప్పుడే తన సుఖము చూసుకుంటాడు. వారికి లేని సుఖమునకై ఎగపడడు. అలాగ కాక, తనవాళ్ళు బాగున్నారో లేదో చూడకుండా తన సుఖము చూసుకునేవాని కన్న భిక్షాటన చేసుకునేవాడు అధికుడు.

ఇక్కడ కుక్కకీ అటువంటి లోభికీ పోలిక చెప్పాబడింది. కుక్క ఎటువంటి అన్నం కనబడినా ఎగబడి, తనవాళ్ళ గురించి చింత లేకుండా తింటుంది. లోభి కుక్కవంటివాడు - మరియూ అతను తినెడి సొమ్ము పాడైన కూడు వంటిది.

ఆడువారికి వేదాంతం మప్పటం కష్టం

భగభగ మండెడి నిప్పుకు
తగులిన యింధనమువోలె తాపాగ్నులజే
రగిలెడి రమణికి చెప్పిన
నిగమాంతములున్ తగులడు నిక్కము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
తాపాగ్నులు = తాపత్రయాలు (ఆధ్యాత్మిక, అధిభౌతికము, అధిదైవికము ఐన కష్టాలు, చింతలు)
రగులు = రాజుకొను, మండు
నిగమాంతములు = వేదాంతములు
నిక్కము = నిజము

భావము:
--
కోపం/ఆవేశం/దుఃఖంలో ఉన్న స్త్రీకి మనం చెప్పే వేదాంతధోరణి నచ్చదు.

ఆడువారికి వేదాంతములు, వైరాగ్యధోరణీ అలవడటం కష్టం. అందుకే మగజన్మని కొంత ఉన్నతంగా కొన్ని పురాణాలలో చెప్పారు.

ఐతే దీనికి స్త్రీలు కోపం పడవలసింది లేదు. ఎందుకంటే తమనుండి మరొకరికి జన్మనిచ్చే అదృష్టం భగవంతుడు స్త్రీలకే ఇచ్చాడు. అందుచేతనే వారికి పేగు బంధం మగవారి కంటే ఎక్కువ. వారికి భౌతికమైన బంధాలు ఇంకా బలీయమైనవి. మన పురాణాల్లో అందుకే భర్త చేసిన ప్రతీ తపస్సు వంటి సత్కార్యాలలో భార్యకూ సగం పుణ్యం లభిస్తుంది అని చెప్పారు.

ఈ పద్యము ఎవరికైనా కోపం కలిగించి ఉంటే మన్నించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇది కేవలం నా అనుభవం.

సహనం స్త్రీలకే సాధ్యం, అలంకారం

వహియించుట ధరభారము
దహియించెడియగ్గిఁజేతఁదాల్చుట సులువౌ
సహనము కరువైన నెలత
సహవాసము జేయఁగాదు సాధ్యము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
వహియించు = మోయు, భరించు
సహవాసము = కలిసి జీవించు
నెలత = స్త్రీ

భావము:
--
సహించే శక్తి ఆడువారికి ఇచ్చాడు భగవంతుడు. అది వారికి అలంకారం. భూమియొక్క భారాన్ని మోయుట, అగ్గిని చేత పట్టుట సాధ్యమేమో కానీ, సహనం లేకుండా (మగనిపై) విరుచుకు పడుతూ, కించపరుస్తూ ఉండే స్త్రీతో సహవాసం చెయ్యడం కష్టం.

Sunday, September 2, 2007

మాటలు చెప్పడం సులువు

కోటలు గట్టొచ్చు, సిరుల
తోటలు పండించవచ్చు, దొనరగ దివిలో
బాటలు వేయొచ్చు, బలిమి
మాటలఁజెప్పుట సులభము మనిషికి శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
దొనరగ = ఒప్పే విధంగ
బలిమి = గొప్ప

భావము:
--
ఆకాశంలో దారులు వేస్తాను, కోటలు కట్టేస్తానని, డబ్బు సంపాదిస్తాననిమొదలైన మాటలు చెప్పుట ఎవరికైనా సులభమే! (అవి సాధించడం కష్టం).

అత్త-కోడలు, మామ-అల్లుడు

శతమాన్యుని యెదుటనసుర

పతికీర్తన జేయచెల్లు, పామరము సుమీ

సతిచెంత తల్లి పెరిమియు

పతిముందర తండ్రి ఘనత పలుకుట శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:

--

శతమాన్యుడు = ఇంద్రుడు

అసురపతి = రాక్షసుల రాజు

పామరము = అఙానం

పెరిమి = గొప్పదనం


భావము:

--

ఇంద్రుడి ముందు రాక్షసులరాజును పొగడవచ్చునేమో (వారు సవతిబిడ్డలు కాబట్టి సహజవైరం కలదు). కానీ భార్యముందు తల్లినీ, భర్త ముందు తండ్రినీ పొగుడుట మాత్రము అఙానమే ఔతుంది.

పొగుడుతుంటే కలిగే తృప్తి అనిర్వచనీయం

కీరము తీయగ పలికిన
ధారాతము కూసిననతి ధారాళముగన్
నారదగానము సాగిన
మీరదు మాధుర్యమందు మెప్పును శాస్త్రీ


కొన్ని పదాలకు అర్థాలు:
--
కీరము = చిలుక
ధారాతము = కోకిల
ధారాళముగ = అడ్డులేకుండా
మీరు = దాటు, అధిగమించు

భావము:
--
చిలుక పలికినా, కోకిల స్వతంత్రంగా కూసినా, నారదుడేగానము చేసినా, అవేవీ మనని ఎవరైనా పొగిడితే తోచేంత మధురముగా తోచవు. పొగడ్తే అన్నిటికంటే తీయని పలుకు.

తక్కువగా మాట్లాడటం ఉత్తమం

పాకంబున లవణమువలె
స్తోకంబుగ పలికినంత దొరయనడుగుచున్
కైకొందురు, హెచ్చినచో
యేకంబుగనుమ్మిపోదురెల్లరు శాస్త్రీ


కొన్ని పదాలకు అర్థాలు:
--
పాకము = వంటకం
లవణము = ఉప్పు
స్తోకంబు = తక్కువ
దొరయగ = తగినట్టుగ
కైకొను = తీసుకోను
హెచ్చు = ఎక్కువ అగు

భావము:
--
కూరలో ఉప్పు తక్కువైతే తగినంత అడిగి కలుపుకుంటారు. అదే ఎక్కువైతే నోట్లో వేసుకున్నది ఉమ్మిఫోతారు. మరింక ఉప్పు తగ్గించలేము. అలాగే మాట్లాడటం కూడా. తక్కువగా మాట్లాడితే కావలసిన విషయం అడిగి తెలుసుకుంటారు. అదే మనం ఎక్కువగా మాట్లాడితే మాటలు వెనక్కి తీసుకునే మార్గం లేదు. అందరి దృష్టిలోనూ మూర్ఖులమౌతాము.

కుళ్ళు లేని కోమలి, మోసం చెయ్యని మగవాడు

ఇరుగుపురుగు గృహములలో
సిరులఁగనియు యేడ్వకుండు చేడియ గుణమున్
పరధనమునకాశపడని
పురుషుని ఘనతయు తగునుర పొగడగ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
చేడియ = స్త్రీ

భావము:
--
పరులు ఉన్నతిని చూసి బాధపడక ఉన్నదానితో సంతృప్తి చెందే ఆడుది, పరుల ధనానికి ఆశపడక స్వయంకృషితో బ్రతికే మగవాడు పొగడదగినవారు.

ఆత్మగౌరవం అన్నిటి కంటే ముఖ్యమైన సంపద

పొట్టియకాటులనోర్చుచు
పట్టెపు పోటులఁ భరింప బహుసులభంబౌ
తిట్టిననోపగజాలము
చుట్టములే తప్పు లేక, చూడక శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
పొట్టియ = తేలు
పట్టెము = పెద్ద కత్తి

భావము:
--
తేలు కుట్టిన నొప్పి పైన ఎవరైనా కత్తితో హింసించినా భరించవచ్చునేమో కానీ, (ప్రియమైన) బంధువు మన తప్పు లేకుండా, తప్పొప్పులు తెలుసుకూకుండా నిందిస్తే భరించలేము.

మహర్షులను సైతం మోసం చేసేది

రతిఁగోరుచు దరిఁజేరిన
సతినాపగఁజాలలేదు సాయంత్రమునన్
యతివరుడైనను కామము
మతిపోగొట్టును మదనుని మాయర శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
యతివరుడు = మునులలో శ్రేష్ఠుడు
మదనుడు = మన్మథుడు

భావము:
--
కశ్యపుడు గొప్ప ముని. ఆయన భార్య ఐన దితి అసురసంధ్యవేళలో కూడుటకు చేరగా వారించలేకపోయాడు ఆ ముని. అంతటి ఙానిని కూడా అశక్తుడిగ చేసేది కామము. అందుకే ఎల్లపుడు వివేకులై, సావధానులై ఉండాలి బ్రహ్మచారులు.

విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

గురువును మన్నన సేయుట
ఎరుగుదునను యెగపు విడిచి యేకాగ్రతతో
విరివిగ సాధన సలుపుట
నిరతియు ఛాత్రులకు వలయు, నియమము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ఎగపు = పొగరు
నిరతి = కుతూహలము, నేర్చుకోవాలనే కోరిక
ఛాత్రుడు = విద్యార్థి

భావము:
--
గురువును గౌరవించడం, అన్నీ తెలుసును అనే పొగరు మాని నిరంతరమూ సాధన చెయ్యడం, తెలుసుకోవాలనే కుతూహలము మంచి విద్యార్థికి కావలసిన లక్షణములు.

భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడికి ఈ లక్షణాలు ఉన్నందునే గీతని బోధించనున్నాను అని చెప్పాడు.

Saturday, September 1, 2007

ఒకరిని సరిగ్గా విమర్శించగల శక్తి వారికే ఉంది

ఇరువురు నీ తప్పొప్పులు
ఎరుగుదురీ విశ్వమందు నెన్నగనెపుడున్
చొరనీయవాత్మబల్కులు
పరమాత్ముడు నీదుతోడ బలుకడు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ఎన్నగ = పరిశీలించగ
చొరనీయు = వినబడనీయు

భావము:
--
ఈ సృష్టిలో ఇద్దరికే నీ తప్పొప్పులు తెలుస్తాయి - ఆత్మ, పరమాత్మ. ఆత్మతో నువ్వు మాట్లాడవు, దాని మాట వినవు. పరమాత్ముడు నీతో మాట్లాడడు. ఈ విధంగా ఉంటే, ఎప్పటికీ నిన్ను నువ్వు పరిశీలించుకోలేవు. అందుకే ఆత్మనీ, పరమాత్మనీ అర్థం చేసుకోవాలి.

అరిషడ్వర్గము జయించుట నిజమైన ఘనత

కరిశతసమబలుడైనను
దరిజేరిననప్సరసలు దరహాసముతో
సిరియింటనె కొలువున్నను
అరిషడ్వర్గమును విడకనల్పుడు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
కరిశతసమబలుడు = వంద ఏనుగుల బలం కలవాడు
సిరి = లక్ష్మీ దేవి
అరిషడ్వర్గము = కామక్రోధలోభమోహమదమాత్సర్యములు - అనెడి ఆవేశములు
అల్పుడు = తక్కువ వాడు

భావము:
--
డబ్బు, కండబలం, కాంతాసాంగత్యము సాధించినవాడైనా వాడిని వాడు జయించకపోతే అల్పుడే అవుతాడు.