Saturday, October 20, 2007

చెడ్డబుద్ధి కలిగినవానికి చేసే ఙానబోధ వృధా

అనలుని చేరిన యాజ్యము
వనధిని కలిసిన వరుణము వక్రాత్మునకున్
దొనరగ మప్పిన ధర్మము
కనపడవో క్షణము పిదప కానర శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
అనలుడు = అగ్నిదేవుడు
ఆజ్యము = నెయ్యి
వనధి = సముద్రము
వరుణము = నీరు
వక్రాత్ముడు = చెడ్డ బుద్ధి కలవాడు
దొనరగ = చక్కగ
మప్పు = నేర్పించు
పిదప = తరువాత
కాను = గ్రహించు

భావము:
--
అగ్నిలో పోసిన నెయ్యి, సముద్రములో కలిసిన నీరు, మూర్ఖుడికి మప్పిన నీతులు ఒక్క నిముషము తరువాత కనబడవు.

అగ్నిలో ఎంత నెయ్యి పోసినా ఆవిరైపోతుంది. చెరుకురసం తెచ్చి సముద్రములో కలిపినా ఉప్పగానే ఉంటుంది. అలాగే పొగరు నిండిన మనసులో నీతిని ఉంచుదామనుకున్నా మాయమవుతుంది. మన సమయం మాత్రం వృథా అవుతుంది.

పోరాటం చేసే ముంది ఆలోచించాలి

తగు సమయము గమనించక
పగవారల బలిమి గనక ఫలమెంచక తా
పొగరుగ తలబడు మొరకుడు
నగవులపాలై కడచును నష్టము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
పగవారు = శత్రువులు
బలిమి = శక్తి
కను = చూడు
ఎంచు = అంచనా వేయు
మొరకుడు = మూర్ఖుడు
నగవులపాలవ్వు = నవ్వులపాలవ్వు
కడచు = అనుభవించు, నశించు

భావము:
--
ఒకరితో పోరే ముందు, మన శక్తినీ, వారి శక్తినీ అంచనా వెయ్యాలి. తగిన సమయము చూసుకొని ముందడుగు వేయాలే తప్ప, పొగరుగానో ఆవేశంగానో ముందుకు పోకూడదు. మనకి వచ్చే ప్రయోజనం కంటే ఎక్కువ శ్రమపడితే మనం ఓడిపోయినట్లే. మంచిచెడులు చూసుకోకుండా తెగించి ఓడిపోయినవారిని చూసి నలుగురూ నవ్వుతారు కూడా.

నా బాల్యంలో "ఏడు ఘడియల రాజు" అనే కథ చదివాను. అందులో ఒకని జాతకంలో ఏడు ఘడియల పాటు రాజుగా ఉండాలి అని వ్రాసిపెట్టి ఉంటుంది. వాడు ఒకానొక రాజు మీద దండెత్తగా ఆ రాజు ఈ విషయం తెలుసుకుని, రాజ్యం వానికి ఇచ్చేసి, ఏడు ఘడియల తరువాత తిరిగి దండెత్తుతాదు. దానితో "ఏడు ఘడియల రాజు" కథ సమాప్తం. ఇక్కడ తగిన సందర్భం చూసుకున్న రాజు ఓడినట్లు కనబడినా నెగ్గాడు.

భారతంలో కృష్ణుడు, ఒక పురోహితుణ్ని రాయబారిగా, దుర్యోధనుడికి చెబుతాడు: "నువ్వు పాండవుల సేన ఏడు అక్షౌహిణిల సేన అనుకుంటున్నావు. నీది పదకొండు కదా అని విర్రవీగుతున్నావు. కానీ సాత్యకీ, భీమ, నకుల, సహదేవులు ఒక్కొక్కరూ ఒక్కొక్క అక్షౌహిణీ సేనకు సమానం. ఇక అర్జునుడు, శ్రీకృష్ణుడు ఉంటే వారి ముందు మీ సేన నిలబడనే లేదు", అని. ఇక్కడ దుర్యోధనుడు మిక్కిలి తెలివైన, రాజకీయం తెలిసినవాడైనా, పొగరుతో అవతలవారి శక్తిని సరిగ్గా అంచనా వెయ్యలేకపోయాడు.

Sunday, October 14, 2007

అనుబంధం సంబరంలాగా ఉండాలి

చనుబాలీయని తల్లులు
కనుపాపను రెప్పవోలె కాయని తండ్రుల్
కినుకవహించెడి దారలు
ధనమాశించెడి తనయులు దైత్యుల్ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
కినుక = కోపము
వహించు = ధరించు
దార = భార్య
తనయులు = పుత్రులు
దైత్యులు = రాక్షసులు

భావము:
--
చనుబాలిచ్చి పిల్లల్ని పెంచని తల్లి, కనుపాపని రెప్ప ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా పిల్లల్ని కాపాడని తండ్రి, ఎప్పుడూ కోపం ప్రదర్శించే భార్య, తల్లిదండ్రులనుండి సంపదలాశించే పిల్లలు రాక్షసులతో సమానం.

ఇక్కడ చనుబాలియ్యడం అనే దానిని అచ్చంగా తీసుకోవద్దు. చనుబాలు శ్రద్ధకు, శుద్ధతకు, మమకారానికీ చిహ్నం. తల్లికి పిల్లల పట్ల అవన్నీ ఊండాలి అని ఉద్దేశం.

నీచులతో వాదన వృథా అవుతుంది

అల్పుని కడ వాదించకు
కల్పుకొనెడి మాట విడచి ఘనముగ పల్కున్
సల్పు కలుగు చందంబున
గెల్పు కడకు వానిదౌను ఖిలముర శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
అల్పుడు = నీచుడు, దుర్బుద్ధి కలిగిన వాడు
ఘనముగ = హద్దు లేకుండా, విరివిగ
సల్పు = బాధ, నొప్పి
చందంబు = విధంబు
కడకు = చివరకు
ఖిలము = వృథా

భావము:
--
నీచులతో వాదించి ఉపయోగం ఉండదు. వారి మాట వారిదే కానీ పక్కవాడి మాట వినరు. పైగా, మనం చెప్పిన మంచిమాటలు కూడా పెడచెవిని పెట్టి తగువు మాటలు మాట్లాడతారు. ఏదో ఒక విధంగా గెలుపు వారిదే అనిపించుకుంటారు. వాదించినవారి పరువు కూడా చెడుతుంది. అందుకే వారికి వీలైనంత దూరంగా ఉండాలి.

విజేతకి నిరంతరసాధన అవసరం

ఎంతటి కోవిదుడైన ని
-రంతరసాధన నెరపక రంజింపడెటన్
వృంతము తుంపదు నూరక
గొంతులఁ ఖండించు గండ్రగొడ్డలి శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
కోవిదుడు = పండితుడు, విద్యను బాగుగా నేర్చినవాడు
నిరంతర + సాధన = తరచూ పరిశ్రమిస్తూ ఉండుట
నెరపు = చేయు
రంజింపడు + ఎటన్ = ఎక్కడా వెలుగుడు (జయించడు)
వృంతము = (పువ్వు/ఆకు యొక్క) తొడిమె
నూరు = పదును చేయు
గండ్రగొడ్డలి = పెద్ద గొడ్డలి (పరశురాముడు ఆయుధంగా వాడేవాడు)

భావము:
--
మనుషుల గొంతులు నరికే గొడ్డలి సైతం నూరుతూ ఉండకపోతే కొన్నాళ్ళకు పదును పోయి తొడిమెలు కూడా తుంపలేదు. అలాగే ఎంతటి విద్యావంతుడైనా నిరంతరం సాధన చేయకుంటే ఏదో ఒక రోజు ఓటమిపాలవుతాడు.

Saturday, October 13, 2007

మగవాడికి తెగువ ఉండాలి

భగభగ రగిలించతరము
చిగురులనైనన్ తడిసిన చిదుగులనైనన్
తెగువే మాత్రము జూపని
మగనిని సహియింపరాదు మగువకు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
రగిలించు = మండించు
చిదుగులు = ఇంధనంగా వాడే పుల్ల
తెగువ = సాహసము, పట్టుదల
మగువ = స్త్రీ

భావము:
--
స్త్రీ పచ్చి ఆకులనూ, తడిసిపోయిన పుల్లలనూ ఐనా వెలిగించగలదు (వంటలో భాగంగా). కానీ, సాహసం లేకుండా ఎప్పుడూ భయపడుతూ, ముందుచూపు లేకుండా ప్రవర్తించే భర్తను మాత్రం భరించలేదు.

భర్త భార్యకు రక్షణగా ఉంటాడు కాబట్టి "భరించేవాడు" అన్నారు. అలాగ కాకుండా ఆపద నెత్తి మీదకు వచ్చే వరకు ఊరుకున్నా, వచ్చాకా ఎదుర్కోనడానికి తెగువ చూపలేకున్నా వాడిని భర్త అనడం వృథా!

Wednesday, October 10, 2007

మనిషిని శీలం చూసి గౌరవించాలి

వంక నడత గలవానిన్
శంక విడిచి నమ్మవచ్చు శత్రువునైనన్
పొంకముగని నమ్మకుమీ
బొంకులఁ మరిగిని మగువలు బుద్ధులఁ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
వంక = చెడ్డ
నడత = నడవడి
శంక = అనుమానం
పొంకము = అందము
బొంకులు = అబద్ధములు

భావము:
--
మొదలుగా, ఇది చదివే ఆడువారందరూ నన్ను క్షమించాలి. "ఎందుకు ఆడువారి మీద వ్రాస్తాడు వీడు - స్త్రీద్వేషి వీడు", అనుకోకండి. నేను పురుషుల మీద కూడా వ్రాశాను సుమీ.

భావం విషయానికి వస్తే, ఇది: మోసగాడు ఐనా శత్రువుని నెరనమ్మవచ్చు కానీ, అందం చూసి అబద్ధమాడే ఆడుదానిని మాత్రం నమ్మకూడదు.

కొంతమంది మగవారికి ఆడువారు అందంగా కనబడితే వారు చేసే తప్పులు కనబడకపోవచ్చు. అటువంటివారికోసమే ఇది. ఆడువారు అబద్ధం ఆడితే అది జీవితాలనే మార్చేయగలదు. అందులొనూ అతిముఖ్యంగా వారిని అందరూ నమ్ముతారు. "ఆడబిడ్డ అబద్ధం ఎందుకు ఆడుతుంది", అని. అందుకే అబద్ధం ఆడే ఆడవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

అంటే మగవారు అబద్ధాలు ఆడరా అంటే - నా జీవితంలో అతినీచమైన అబద్ధాలు ఆడిన మగవారినీ చూశాను. ఐతే వాళ్ళకు ఆడువారికి ఉండే "అయ్యో, ఆడబిడ్డ", అనే జాలి దక్కదు. వారికి చూడగానే అందంతో ఆకట్టుకునేంత విషయం కూడా ఉండదు - అని నా అనుమానం. ఆ వీషయం ఆడువారికే తెలుస్తుంది.

Tuesday, October 9, 2007

భార్యాబిడ్డల క్షేమం చూసుకోవడం భర్త ప్రథమకర్తవ్యం

ఆలిసుతులనేలనిపతి
ఆలిని నెరనమ్మని పతి, యాపదనందున్
బేల పలుకులాడెడిపతి
గాలికి తిరిగెడి పతి, పతి గాడుర శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
నెరనమ్ము = పూర్తిగా నమ్ము
బేల = భయపడిన

భావము:
--
పెళ్ళాంబిడ్డల్ని ఏలుకోనివాడు, భార్యపైన విశ్వాసం వాడు, కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోయేవాడు, ఇంటిపట్టున ఉండకుండా వీధిలో తిరుగుతూ ఉండేవాడు - భర్త కానే కాదు.

భర్తకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం తన కుటుంబాన్ని రక్షించుకుంటూ ఉండడం. దానికి ముఖ్యాంగా దోహదపడేది భార్యను గౌరవించి ఆదరించడం.

Sunday, October 7, 2007

భార్యాభర్తల మధ్య గౌరవం ఉండాలి

పెలుచగ పలుకుట, భర్తను
చులకన జేయుట, యునికిని చూడక మగడిన్
పలువురిలోనెదిరించుట
కులసతులకు కాదు పాడి, కూడదు శాస్త్రీ

కొన్ని పదములకు అర్థములు:
--
పెలుచగ = కఠినంగా
ఉనికి = పరిస్థితి
కులసతి = గౌరవించదగిన ఇల్లాలు
పాడి = ధర్మము
కూడదు = తప్పు, చేయరాదు

భావము:
--
భర్తతో కఠినంగా మాట్లాడటం, భర్తను గురించి ఎంత సన్నిహితలదగ్గరైనా తక్కువగా మాట్లాడటం, చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించకుండా భర్తను నలుగురిలో ఎదిరించి మాట్లాడటం గౌరవించదగిన ఇల్లాలు చెయ్యదు. అలాగ చేసే ఆడువారు (తమది, తమ భర్తది, తమ ఇంటిది) గౌరవాన్ని కోల్పోతారు.

నేను భార్యాభర్తల గురించి వ్రాసిన పద్యాలలో ఎవరో ప్రస్తావించి చెప్పినవి కూడా భార్యాభర్తలకిద్దరికీ వర్తిస్తాయి. ఎందుకంటే సంసారంలో అన్ని విషయాల్లోనూ వీరిద్దరివీ సగపాలు.

మగడు భార్యని అర్థం చేసుకోగలగాలి

సతి మతినెరుగని పతి రవి
శతసమమౌ ద్యుతి కలిగిన శార్వరినందున్
రతిజత యితడికి పితయను
అతివల మదిలో మెదిలిననల్పుడు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
సతి = భార్య
మతి = మనసు, ఆలోచన
రవిశతసమము = వంద సూర్యులతో సమానమైన
ద్యుతి = వెలుగు
శార్వరి = రాత్రి
రతి = మన్మథుని భార్య
జత = భర్త
పిత = తండ్రి
అల్పుడు = తక్కువవాడు, హీనుడు

భావము:
--
కట్టుకున్న భార్య మనసుని అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించని భర్త రాత్రిలో కూడా సూర్యునివలే భాసించేంతటి అందగాడైనా, తను మన్మథుని పుత్రుడా అంటూ ఆశ్చర్యపోయే ఆడువారి మనసులో కోట కట్టుకుని నిలిచినా, వాడు అల్పుడే!

భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. దానికి ఎంతో కొంత భర్త ఎక్కువ దోహదపడాలి (ముందడుగు వేయాలి). ఎందుకు అంటే, తరతరాలుగా భర్తలే (మన దేశంలో) వయస్సు లో పెద్దవారు, మానసిక-పరిపక్వత కలిగే వయస్సు కలిగినవారు. పైగా, ఆడువారు అంతగా మనస్సులో కలిగిన భావాలను బయటికి చెప్పుకోవడానికి అలవాటుపడరు. (ఈ కాలంలో చాలామంది స్త్రీలు ఆ విద్యను కూడా మరిగారు అనుకోండి).