Saturday, June 30, 2007

విషయం తెలియకుండా వనితకు వాగ్దానం

సతి గోర్కెకు ధరణీపతి
సుతరత్నమునడవికంపె, సురధుని సుతులన్
పతిబాసకు నీటవిడిచె
మతినెరుగక మాటలీకు మగువకు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ధరణీపతి = మహారాజు (దశరథుడు)
సుతరత్నము = సుతులలోకెల్ల రత్నము వంటివాడు (రాముడు)
సురధుని = సురప్రవాహం (గంగ)
పతిబాస = పతియొక్క వాగ్దానం
మతి = అంతరంగం

Wednesday, June 27, 2007

పిల్లల్ని పెంచటం ఒక యఙం

లవలేశమె కలుగును కొల
శివలింగము దెచ్చిపూజ సేయని వటుకున్
చవిచూతురు నరకమునిలఁ
వివరించక మంచిచెడుల బిడ్డకు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
లవలేశము = చాలా తక్కువ
కొల = పాపమునకు శిక్ష
వటుడు = బ్రహ్మచారి
చవిచూచు = రుచిచూచు

అడుగకనే ఉపాయము

అడుగనివానికుపాయము
వెడయగు మన్నన బొరయక వెతలను తెచ్చున్
చెడిపోయినదందురొరులు
గొడగొనకనె పెట్ట తిండి గోముగ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ఉపాయము = సలహా
వెడయగు = వృథా అవుట
మన్నన = మర్యాద
బొరయు = పొందు
వెతలు = కష్టాలు
ఒరులు = అన్యులు
గొడగొను = ఆకలివేయు
గోముగ = మిక్కిలి గారంగా

ఆసక్తిలేని వారికి విద్యని మప్పుట

కలగక మనమున గోరిక
విలువగు విద్యలఁ కరచిన విటబోవుటకౌ
వెలుగని పుల్లలలోపడి
వలచగ సాంబ్రాణికెట్లు వచ్చును శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
మనము = మనస్సు
కరచు = మప్పు, నేర్పించు
విటబోవుట = వృథా అవుట

Tuesday, June 26, 2007

సహనము నశిస్తే

సహనము కలవాని కినుకు
దహనము గావించునొరుల ధమనుని రీతిన్
సహతానోరిమి గలదియు
నిహనన నెరపదె యదరిన నిమషము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
కినుక = కోపము
ఒరులు = అన్యులు
ధమనుడు = క్రూరుడు/అగ్ని
సహ = భూమి
ఓరిమి = ఓర్పు
నిహనన = వినాశనం
నెరపు = చేయు
అదరు = కంపించు

యవ్వనం

ఖరవరుగూతలె గానము
కొరనెల యడరించు కిరణకుసుమశరంబుల్
తరుచరురూపమె యందము
తరుణిమ జూపును మహిమలు దండిగ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ఖరవరుడు = గాడిదలలో ఉత్తముడు
కొరనెల = కొంచెమే కనిపిస్తున్న చంద్రుడు
కుసుమశరంబుల్ = మన్మథబాణాలు
తరుచరుడు = చెట్లపై చరించేవాడు - కోతి
తరుణిమ = యవ్వనం

సంతోషం - ఆకాశం

ఏదను వారలకుండదు
మాదనుకొనువారికెల్ల మహిపైనుండున్
రోదసి మాదిరి జూడగ
మోదమునకు మదినియూహ మూలము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
మహి = నేల, భూమి
రోదసి = ఆకాశం, అంతరిక్షం
మోదము = ఆనందము
ఊహ = ఆలోచన, తలపు

Friday, June 22, 2007

సుఖదుఃఖములు

మరిగినపుడు చదలకెగసి
కరిగినపుడు కడలిని పడు గంగ విధమునన్
తరుగక మదికింగోరిక
తిరుగును సుఖదుఃఖములను తిరికలఁ శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
చదలు = ఆకాశం
తిరిక = మెలిక

ఆత్మ, పరమాత్మ

ఇరువురు నీ తప్పొప్పుల
నెరుగుదురీ విశ్వమందు నెన్నగనెపుడున్
చొరనియ్యవెయాత్మపలుకు
పరమాత్ముడు నీదుతోడ పలుకడు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
చొరనియ్యు = వినిపించుకొను
నీదుతోడ = నీతోటి

ముక్తి

నానా విషయాసక్తులుఁ
నా,నాకను భావమెల్ల నశియించు తరిన్
నానాటికినక్కరుడుగు
నానాటికి ముక్తి గల్గునార్యుకు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
నానా = బహువిధాల
అక్కర = అవసరం/కోరిక

Thursday, June 21, 2007

యోగి

భోగులు సుఖమాశింతురు
జోగులు విడుదురు సుఖమును చుచ్చున్ మాయా
రోగులు రోదింతురెపుడు
యోగుల మదిఁరాదు భావయుగళము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:

యోగి - ఫలితము మీద ఆశ లేకుండా పని చేసెడివాడు
జోగి - సన్యాసి, భవబంధాలను విడిచిపెట్టినవాడు
భావయుగళం - మంచి, చెడు అనెడి రెండు విధములైన భావములు

శ్రీరామ

నమస్కారం,

నాకు శాస్త్రీ అనే పేరు చాలా ఇష్టం. కందపద్యాలన్నా ఇష్టం. అందుకే నాకు అప్పుడప్పుడూ అనిపించిన విషయాలను ఈ శాస్త్రీ శతకంగా వ్రాయాలని అనిపించింది.

మరి ఏదో పుస్తకంలో వ్రాసుకోకుండా ఎందుకు blog చేస్తున్నారు అని అంటారా, పుస్తకాలు ఎక్కడకెళ్ళినా మోసుకెళ్ళే అవకాశం ఉండదు. పైగా మీ లాంటివాళ్ళ అభిప్రాయం తెలుసుకునే అవకాశమూ ఉండదు.