Sunday, April 13, 2014

గురుపాదములు

సిరులెన్నైననుఁ జాలవు
తరుణుల సరసము చివరికు తలనొప్పేయౌ
పరమగు పదవిని పొందగ
గురుపాదములందు భక్తిఁ గోరుమ శాస్త్రీ!

భా:- మనుషులను నడిపేవి మూడు: డబ్బు, అధికారం, స్త్రీలోభం. దీన్నే శ్రీ రామకృష్ణులు  "కామినీ కాంచనాలు" అనేవారు. ఇవి మనసును భ్రమింపజేసినట్టుగా మాతృభక్తి కూడా చెయ్యలేదు. ఇవి ఎంత పొందినా సంతృప్తి ఉండదు. అన్నిటికంటే ఉత్తమమైన సిరి, సుఖం, పదవి - ముక్తి. అది పొందాలంటే గురుపాదాల మీద అచంచలమైన భక్తీ ఉండాలి. అది కలగాలన్నా పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాలి. అది కోరుకోవాలి. మిగతావి అన్నీ కలవంటివే.

నిదుర

నిదురించిన మది కానదు
కదిలించెడి దుఃఖములను గమ్మనియుండున్
మెదలును మెలకువ కలిగిన 
మది నిదురను చెదరనీక మనరా శాస్త్రీ!

భా: గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు (సుషుప్తి) మనకు ఏ దుఃఖము, బాధ గుర్తుండవు. శాంతంగా ఉంటాము. అదే నిదుర లేచాక అనేక ఆలోచనల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాము. దుఃఖం కనిపిస్తుంది. అదే మదిని (దేహాన్ని కాదు) ఎప్పుడూ నిద్రలో ఉంచగలిగితే అదే మోక్షం కదా?

నేను "నిద్రపోయాను" అన్నప్పుడు మనసు నిద్రపోతోంది కానీ ఆత్మ కాదు. ఆత్మ చైతన్య స్వరూపం. దానికి నిదుర లేదు. అశాస్వతమైనది, పరిమితమైనది, చాంచల్యం కలిగినది మనసు మాత్రమె. ఆ మానసు అపరిమితమైన ఆత్మను పరిమితమని నమ్మించడం వలన దుఃఖం కలుగుతోంది. ఆ మనసును అదుపులో ఉంచుకుని శాంతపరిస్తే, చివరకు అదే మాయమయ్యి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది.