Monday, September 17, 2007

జూదము అన్నిటికంటే పెద్ద వ్యసనం

లేశము బడయక పాండవు
లాశలకోడిరి తమసతి లజ్జయు, లిబ్బుల్
దేశము వీడిరి కానలఁ
క్లేశములొందిరి వలదుర కితవము శాస్త్రీ

కొన్ని పదములకర్థములు:
--
లేశము = చాలా తక్కువ, కొంచెం, అణువు
లజ్జ = అభిమానము, సిగ్గు
కాన = అడవి
క్లేశము = బాధలు, కష్టాలు
కితవము = మోసముతో కూడుకున్నది (జూదము)

భావము:
--
ఎంతో బలవంతులయ్యుండి పాండవులే ఆశతో జూదమాడి తమ భార్య మానానికి ప్రమాదం తెచ్చుకున్నారు, వారి ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. వారి స్వదేశముని విడిచి, అడవులలో కష్టాలు అనభవించారు. (ఇంక మనమెంత). జూదము వలదు.

2 comments:

రానారె said...

లిబ్బి అనే పదం మా పల్లెలో మాత్రమే విన్నాను. మళ్లీ మీ పద్యంలో చూస్తున్నాను. "ఎందుకు అట్ల మొత్తుకుంటాండావే, నీ లిబ్బంతా పోయినట్టు. ఇంగ సాలిచ్చు (ఇంక చాలించు)" - ఇలాంటి ఎత్తిపొపుడు సందర్భాల్లో మాత్రమే 'లిబ్బి'ని వాడటం నేను విన్నాను. ఇదే అర్థంలో "మీ తాత గంటు" ... అనడంకూడా ఉంది. గ్రంధస్థ సాహిత్యంలో 'గంటు' అనేపదాన్ని నిధి, సంపద అనే అర్థాల్లో మీరు ఎక్కడైనా చూశారా సందీప్‌గారూ?

Sandeep said...

నేను ఎప్పుడూ చూడలేదు సోదరా! లిబ్బులు అనే పదం పల్లెల్లో వాడతారని ఇటీవలే నేనూ గ్రహించాను.